Donald Trump: ధర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:26 PM
నేషనల్ గార్డ్ ట్రూపర్స్‌పై అఫ్గానీ జాతీయుడు కాల్పులకు తెగబడిన వైనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి అమెరికాకు వలసలను శాశ్వతంగా నిలిపివేస్తామని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా నేషనల్ గార్డ్ భద్రతా దళాలకు చెందిన ఇద్దరిపై అఫ్గానీ జాతీయుడు కాల్పులకు దిగడంతో అగ్రరాజ్యంలో కలకలం రేగుతోంది. ఈ ఉదంతంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా స్పందించారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ (మూడో ప్రపంచ దేశాలు) నుంచి అమెరికాకు శాశ్వతంగా వలసలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఘాటు హెచ్చరికలు చేశారు (Trump on Permanently Pausing Immigration).
‘అమెరికా పూర్తిస్థాయిలో కోలుకునేలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తా. బైడెన్ ప్రభుత్వంలో అక్రమంగా జరిగిన చేరికలన్నిటినీ తొలగిస్తా. అమెరికాకు ప్రయోజనం కలిగించని వారు, అమెరికాపై అభిమానం లేని ఎవరినైనా దేశం నుంచి పంపించేస్తాను. ప్రభుత్వం ద్వారా వారికి అందే సబ్సిడీలను రద్దు చేస్తాను. దేశంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే వారి పౌరసత్వాన్ని తొలగిస్తాను. ప్రజాభద్రతకు ముప్పుగా మారిన ప్రతి విదేశీయుడిని పంపించేస్తాను’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు
‘దేశంలో అక్రమంగా ఉంటూ సమస్యలు సృష్టిస్తున్న వారి జనాభాను తగ్గించే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటాను. రివర్స్ మైగ్రేషన్‌తో మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలం. ద్వేషం, నేరాలు, అమెరికా విలువలకు ప్రమాదకరంగా మారిన వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారెవ్వరూ దేశంలో ఎక్కువ కాలం ఉండలేరు’ అని తేల్చి చెప్పారు.
ఇక ఈ కాల్పుల ఘటనలో నేషనల్ గార్డు దళం సభ్యురాలు శారా బెక్‌స్ట్రామ్ మృతి చెందగా మరో సభ్యుడు వుల్ఫ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ దారుణానికి పాల్పడ్డ అఫ్గానీ జాతీయుడు రహమానుల్లా లకన్వాల్ 2021లో అమెరికాకు వెళ్లాడు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగిన తరుణంలో అతడు వెళ్లాడు. ఇక కాల్పులకు గల కారణాన్ని అమెరికా పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
యూకేలో 80 శాతం మేర తగ్గిన వలసలు.. పెద్ద సంఖ్యలో బ్రిటన్‌ను వీడిన భారతీయులు
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
Read Latest International And Telugu News