Trump: కెనడాపై సుంకాలు డబుల్
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:38 AM
తమ పొరుగు దేశం కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నెర్ర జేశారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీలు, అల్యూమినియంపై ఇప్పటికే విధించిన 25ు టారి్‌ఫను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచబోతున్నట్లు ప్రకటించారు.

వాషింగ్టన్, మార్చి 11: తమ పొరుగు దేశం కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నెర్ర జేశారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీలు, అల్యూమినియంపై ఇప్పటికే విధించిన 25ు టారి్‌ఫను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి రానుందన్నారు. మరోవైపు కెనడాపై అమెరికా విధించిన 25 శాతం టారి్‌ఫలకు ప్రతిగా అమెరికాలోని మూడు రాష్ట్రాలకు తాము సరఫరా చేస్తున్న విద్యుత్ ఎగుమతులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రకటించింది. కెనడా తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడిన ట్రంప్ ఆ దేశానికి చెందిన కార్లు, కలప, విద్యుత్ ఇకపై తమకు అవసరం లేదని అన్నారు. సుంకాల విషయంలో కెనడా వైఖరిని తప్పుబడుతూ ఆ దేశాన్ని అతిపెద్ద సుంకాల దుర్వినియోగదారుగా అభివర్ణించారు. ఇకపై కెనడాకు అమెరికా సబ్సిడీ ఇవ్వబోదని ప్రకటించారు. కెనడా సుంకాలను పెంచుతున్నట్లు చెప్పిన అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో విద్యుత్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కాగా, ప్రస్తుతం అమెరికాకు అత్యధిక ఇంధన ఎగమతులు కెనడా నుంచే వస్తున్నాయి.
టెస్లా కారు కొంటా: ట్రంప్
టెస్లాను బహిష్కరించాలంటూ ఇటీవల అమెరికాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరగడం, ఆ సంస్థ షేర్లు పడిపోతున్న నేపథ్యంలో తాను టెస్లా కారును కొనుగోలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. మస్క్‌కు మద్దతుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘రాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన కొంత మంది వ్యక్తులు కావాలనే కుట్రపూరితంగా టెస్లాను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. టెస్లా ప్రపంచంలోనే గొప్ప ఆటోమేకర్. ఎలాన్ మస్క్ ఓ గొప్ప అమెరికన్. తనకు మద్దతుగా నేను రేపు సరికొత్త టెస్లా కారును కొనుగోలు చేస్తున్నాను. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సహాయం చేస్తున్న అతణ్ని ఎందుకు శిక్షించాలి.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.