Donald Trump Criticizes: భారత్, రష్యా.. మృత ఆర్థిక వ్యవస్థలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:33 AM
భారత్, రష్యాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు.
ఇరు దేశాలూ కలిసి మరింత దిగజార్చుకుంటాయి
అమెరికాకు భారత్ మిత్రదేశమే.. కానీ..వాణిజ్య విధానాలు సమస్యగా మారాయి
మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే: పీయూష్ గోయల్
ట్రంప్ చెప్పింది వాస్తవమే.. ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ‘చంపేశారు’: రాహుల్‌గాంధీ
ట్రంప్ ‘డెడ్ హ్యాండ్’ను గుర్తుచేసుకోవాలి.. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పరోక్ష హెచ్చరిక
వాషింగ్టన్, జూలై 31: భారత్, రష్యాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలవి చేవచచ్చిన ఆర్థిక వ్యవస్థ (డెడ్ ఎకానమీ)లుగా అభివర్ణించారు. ఇరుదేశాలూ కలిసి ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటాయని వ్యాఖ్యానించారు. రష్యాతో భారీగా వాణిజ్య సంబంధాల నేపథ్యంలో భారత్‌పై 25శాతం సుంకాలతోపాటు జరిమానాలు విధిస్తున్నట్టుగా ప్రకటించిన ట్రంప్.. కొన్ని గంటల్లోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి సంబంధించి ఆయన గురువారం తన సొంత సోషల్ మీడియా ‘ట్రుత్’లో పోస్టు పెట్టారు. ‘‘రష్యాతో భారత్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తున్నదో నాకు అనవసరం. ఆ దేశాలు వాళ్ల మృత ఆర్థిక వ్యవస్థలను మరింతగా దిగజార్చుకోవచ్చు. భారత్‌తో మేం చాలా తక్కువ వాణిజ్యం చేస్తున్నాం. ప్రపంచంలోనే అతిఎక్కువగా భారత్ టారి్‌ఫలు ఉన్నాయి. రష్యాతో యూఎ్‌సఏ దాదాపుగా ఎలాంటి వాణిజ్యం చేయడం లేదు. దాన్ని అలాగే ఉంచేద్దాం. తనను తాను ఇంకా అధ్యక్షుడినేమో అనుకుంటున్న రష్యా మాజీ విఫల అధ్యక్షుడు మెద్వెదేవ్ నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఆయన ప్రమాదకర అంశంలో కల్పించుకుంటున్నారు..’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు భారత్ మిత్రదేశమే అయినా.. భారత వాణిజ్య విధానాలు సమస్యగా మారాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ను అంతం చేయకుండా రష్యాను నిలువరించాలని అంతా భావిస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు.
వాణిజ్య ఒప్పందంపై ఒత్తిడి పెంచేందుకే!
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే భారత బృందాలు పలుమార్లు వాషింగ్టన్‌కు వెళ్లి చర్చలు జరిపాయి. వ్యవసాయ, పాడి ఉత్పత్తులు సహా కొన్ని అంశాలపై పీటముడి కొనసాగుతోంది. ఆగస్టు 25న అమెరికా వాణిజ్య చర్చల బృందం భారత్‌కు రానుంది. ఈ క్రమంలో అమెరికా అనుకూల అంశాలతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని.. 25 శాతం సుంకాలు, జరిమానాల విధింపు, ‘మృత ఆర్థిక వ్యవస్థలు’ వంటి వ్యాఖ్యలు అందులో భాగమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్నపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దే..
‘భారత్‌ది మృత ఆర్థిక వ్యవస్థ’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని, కొన్నేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక సంస్థలు, వ్యవస్థలు ఇప్పుడు భారత్‌వైపే చూస్తున్నాయని చెప్పారు. అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం అంశానికి సంబంధించి భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఆయన పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం ప్రకటించారు. అమెరికా సుంకా ల ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై వాణిజ్య సంస్థలు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోందన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని అవమానించడమే: బీజేపీ
ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ సమర్థించడం దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ మండిపడింది.‘‘రాహుల్ గాంధీ పూర్తిగా దిగజారిపోయారు. ట్రంప్ వ్యాఖ్యలను ఆయన సమర్థించడం 140 కోట్ల మంది దేశ ప్రజలను అవమానించడమే. నిజానికి చనిపోయినది ఆర్థిక వ్యవస్థ కాదు.. రాహుల్ ఘన వారసత్వం, ఆయనపై ప్రజల నమ్మకం చనిపోయాయి’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక మనస్తత్వం అలవడిపోయిందని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
ఆరు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇరాన్‌తో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ ఆరు భారతీయ కంపెనీలు సహా 20 సంస్థలపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఈ కంపెనీలేవీ.. అమెరికాతో, అమెరికన్ సంస్థలతో ఎలాంటి లావాదేవీలు విధించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన కంచన్ పాలిమర్స్, ఆల్కెమికల్ సొల్యూషన్స్, రమ్నిక్‌లాల్ ఎస్ గొసాలియా అండ్ కంపెనీ, జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్, పెర్సిస్టెన్స్ పెట్రోకెమ్ సంస్థలు ఉన్నాయి.
ట్రంప్ ‘డెడ్ హ్యాండ్’ను గుర్తు చేసుకోవాలి: మెద్వెదేవ్
‘భారత్, రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు’, ‘ప్రమాదకర అంశంలోకి వస్తున్నారు’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ మండిపడ్డారు. ‘‘ట్రంప్‌కు చాలా ఇష్టమైన రక్తపిశాచాల (జాంబీ)ల సినిమాలు ఆయనను ఇంకా భయపెడుతున్నట్టు ఉన్నాయి. ట్రంప్ ‘వాకింగ్ డెడ్’ వంటి సినిమాలతోపాటు భయంకరమైన ‘డెడ్ హ్యాండ్’ను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి’’ అని మెద్వెదేవ్ పేర్కొన్నారు. ‘డెడ్ హ్యాండ్’ అనేది ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఆటోమేటిక్ అణ్వస్త్ర నియంత్రణ వ్యవస్థ. దేశానికి చెందిన కీలక నేతలు అంతా చనిపోయినా కూడా శత్రుదేశంపై అణ్వస్త్రాలను ప్రయోగించి నాశనం చేస్తుందని చెబుతారు. అప్పట్లో సోవియట్ యూనియన్ ‘డెడ్ హ్యాండ్’ను సిద్ధం చేసిందనే ప్రచారం సాగింది. ఇప్పుడు మెద్వెదేవ్ ‘డెడ్ హ్యాండ్’ను ప్రస్తావించడం ద్వారా అవసరమైతే అణు దాడికి కూడా సిద్ధమనే హెచ్చరికలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.