భాయీ భాయీ.. బాహాబాహీ
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:36 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటి వరకూ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్‌మ్‌స్క మధ్య ‘హానీమూన్’ ముగిసింది.
ట్రంప్-మస్క్ స్నేహబంధానికి బీటలు
మస్క్‌కు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేస్తానన్న ట్రంప్
నాసాకు స్పేస్‌ఎక్స్ సేవలు నిలిపేస్తామని మస్క్ ప్రకటన
బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తితో ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్
మస్క్‌ను బుర్ర లేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్
వాషింగ్టన్, జూన్ 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఇప్పటి వరకూ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్‌మ్‌స్క మధ్య ‘హానీమూన్’ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై.. ఏకంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి దారి తీస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించి.. ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ (డోజ్) అధిపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ, మస్క్‌కు ఎంతో చేశానని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ.. ఇంత కృతజ్ఞతారాహిత్యమా? అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే.. ట్రంప్ శుక్రవారం మస్క్‌కు మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలాన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘మస్క్‌కు ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్టులను, సబ్సిడీలను రద్దు చేయటం ద్వారా వందల కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై మస్క్ వెంటనే స్పందించారు. ‘మీరు మీ నిర్ణయం ప్రకారం ముందుకెళ్లవచ్చు’ అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎ్‌సకు) వ్యోమగాములను తీసుకెళ్లటానికి, తిరిగి తీసుకురావటానికి అమెరికా నాసా ఉపయోగిస్తున్న తమ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన డ్రాగన్ వ్యోమనౌక సేవలను నాసాకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కొన్నిగంటల్లోనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు, ఏబీసీ న్యూస్ అనే మీడియా సంస్థ ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. మస్క్‌తో విబేధాల పరిష్కారానికి ఫోన్‌లో మాట్లాడతారా అని ప్రశ్నించగా.. ‘ఆ మెదడు లేని వ్యక్తితోనా? నాకు ఆసక్తి లేదు. వాస్తవానికి, మస్క్ నాతో ఫోన్‌లో మాట్లాడాలని భావించారు. కానీ, నేనే అందుకు అంగీకరించలేదు’ అని తెలిపారు.
కొనసాగుతున్న మస్క్ దాడి
ట్రంప్ మీద మస్క్ తన దాడిని కొనసాగించారు. అమెరికన్లు కడుతున్న పన్నులను ప్రభుత్వాలు వృథా చేస్తున్నాయంటూ గతంలో ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, పోస్టులను ఎత్తిచూపుతూ.. ఆ ట్రంప్, ఈ ట్రంప్ ఒక్కరేనా అంటూ ప్రశ్నలు సంధించారు. చిన్నారుల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు ఉన్న సంబంధాల గురించి ప్రభుత్వం సమాచారాన్ని తొక్కిపెడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్, జెఫ్రీ కలిసి ఓ విందులో పాల్గొన్న 1992 నాటి వీడియోను షేర్ చేశారు. ట్రంప్‌ను అభిశంసించి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ ఎక్స్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. వీటిపై ట్రంప్ కూడా ఊరుకోలేదు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మస్క్‌ను తానే ఆదేశించానని, దాంతో ఆయన వెర్రివాడిలా మారి అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఎద్దేవా చేశారు. ట్రంప్‌తో మస్క్ సంబంధాలు క్షీణించటంతో ఆయన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. టెస్లా షేర్ల ధరలు మార్కెట్లో గురువారం 14ు మేర పడిపోయాయి. ఫలితంగా ఆ కంపెనీ 15,200 కోట్ల డాలర్ల (రూ.13,03,194 కోట్లు) నష్టాన్ని చవిచూసింది.
ఇదీ నేపథ్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కోసం మస్క్ 30 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్లు) ఖర్చు చేశారు. ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించారు. అందువల్లే, ట్రంప్ కూడా మస్క్‌ను ఆదరించారు. డోజ్ విభాగానికి మస్క్‌ను అధిపతిగా నియమించారు. అయితే, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కోసం ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును మస్క్ వ్యతిరేకించటంతో వారి స్నేహబంధం బీటలువారటం మొదలైంది. ఈ బిల్లును అమలు చేస్తే ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని మస్క్ విమర్శించారు. దీన్ని ట్రంప్ తిప్పికొట్టారు.విద్యుత్ వాహనాలకు ఇస్తున్న పన్ను రాయితీలను ఉపసంహరిస్తున్నందువల్లనే బిల్లును మస్క్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.