Trump PauseTariffs: సుంకాల నిలిపివేత.. ట్రంప్ తెలివి మామూలుగా లేదు కదా
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:51 PM
ప్రతీకార సుంకాల విధింపుతో ప్రపంచ దేశాల మీద విరుచుపడేందుకు రెడీ అయిన ట్రంప్.. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. సుమారు 90 రోజుల పాటు సుంకాల విధింపును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. దీనిలో భాగంగా ప్రతీకార సుంకాలు విధించాడు. ట్రంప్ నిర్ణయం దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్ కుదేలయ్యింది. ప్రపంచ వాణిజ్యరంగంపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. ఆ దెబ్బకు దిగి వచ్చిన ట్రంప్.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలిగిస్తూ.. ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ 90 రోజులూ ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా 10 శాతం దిగుమతి సుంకాలను వసూలు చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు బుధవారం ఉదయం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయంతో అది వాయిదా పడినట్టయింది.
మిగతా దేశాలకు ఊరట కల్పించిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం కయ్యానికి కాలు దువ్వే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే డ్రాగన్ దేశంపై సుంకాల భారాన్ని 104 శాతానికి పెంచిన ట్రంప్.. తాజాగా దాన్ని ఏకంగా 125 శాతానికి పెచుతూ.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పైగా ప్రతీకార సుంకాల విధింపు వాయిదా నుంచి చైనాకు మినహాయింపు ఇవ్వలేదు. దాంతో డ్రాగన్-వైట్ హౌస్‌ల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభం కాబోతుంది అంటున్నారు నిపుణులు.
సుంకాల నిలిపివేతకు కారణం..
ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల పట్ల విదేశాల నుంచి పక్కన పెడితే అమెరికాలో కూడా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రతీకార సుంకాలు వసూలు చేయడం ప్రారంభిస్తే.. అది ప్రపంచ మార్కెట్ పతనానికి దారితీసి.. ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తే పరిస్థితులు వస్తాయని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
అలానే ట్రంప్ నిర్ణయం వల్ల ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దాంతో సుంకాలను నిలిపివేయాలని తోటి రిపబ్లికన్లు, వ్యాపార కార్యనిర్వాహకులు అమెరికా అధ్యక్షుడిని చాలా రోజులుగా అభ్యర్థిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం.. "నా విధానాలు ఎప్పటికీ మారవు" అని చెబుతూ ఆయన తన అభిప్రాయాన్ని కొనసాగించారు.
అయితే ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవ్వడంతో.. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ప్రపంచ దేశాల అభ్యర్థన మేరకు మాత్రమే.. తాను సుంకాల అమలు 90 రోజులు పాటు నిలిపివేస్తు నిర్ణయం తీసుకున్నానంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
దూసుకుపోయిన షేర్ మార్కెట్స్..
అయితే ట్రంప్ సుంకాల అమలను 90 రోజుల పాటు వాయిదా వేయడంతో.. స్టాక్ మార్కెట్లు జోష్ పెరిగింది. ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయ.గురువారం జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ 225 ఉదయం ట్రేడింగ్‌లో 8.8శాతం పెరిగి 34,510.86కి చేరుకుంది. అలానే ఆస్ట్రేలియా S&P/ASX 200 5.1శాతం పెరిగి 7,748.00కి చేరుకుంది. దక్షిణ కొరియా కోస్పి 5.2% పెరిగి 2,412.80కి చేరుకుంది. సుంకాల నిలుపుదల నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. అలానే చమురు ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి, డాలర్ కూడా బలపడింది.
ఇవి కూడా చదవండి:
Michelle Obama On Divorce: విడాకులు తీసుకోబోతున్న ఒబామా దంపతులు.. మిచెల్ ఏమన్నారంటే..
Funny Tomato Video: ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..