Share News

టెహ్రాన్‌పై నిప్పుల వాన

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:43 AM

యురేనియం-235ను వెలికితీసేందుకు సెంట్రీఫ్యూజ్‌ను వినియోగిస్తారు.

టెహ్రాన్‌పై నిప్పుల వాన

యురేనియం-235ను వెలికితీసేందుకు సెంట్రీఫ్యూజ్‌ను వినియోగిస్తారు. ఇలా పదేపదే ప్రాసెస్‌ చేసి.. అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే యురేనియంను సేకరిస్తారు. ఇప్పటికే నటాంజ్‌ అణుకేంద్రం తీవ్రంగా ధ్వంసమైనట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) వెల్లడించిన విషయం తెలిసిందే..! దీంతోపాటు.. తమ వైమానిక దళాలు ఇరాన్‌ ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఈ క్రమంలో తమ యుద్ధ విమానాలపై దాడికి వచ్చిన ఐదు హెలికాప్టర్లపై దాడులు జరిపి, మూడింటిని నేలమట్టం చేసినట్లు ఐడీఎఫ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ డఫెరిన్‌ వెల్లడించారు. కాగా.. బుధవారం కూడా ఐడీఎఫ్‌ అధికారులు పర్షియా భాషలో టెహ్రాన్‌ను వీడి వెళ్లాలంటూ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆరు రోజుల యుద్ధంలో ఇరాన్‌లో 585 మంది మృతిచెందారని, వీరిలో 239 మంది పౌరులున్నారని, 1,326 మంది గాయపడ్డారని మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఇరాన్‌ పౌరులు తమ స్మార్ట్‌ ఫోన్ల నుంచి వెంటనే వాట్సాప్‌ యాప్‌ను తొలగించాలని ఐఆర్‌జీసీ సూచించింది. కాగా.. బుధవారం సాయంత్రం మూడు ఇరాన్‌ ప్రభుత్వ విమానాలు ఒమన్‌లో ల్యాండ్‌ అయినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా చెబుతోంది. ఈ విమానాల్లో ప్రభుత్వాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధం విరమణకు చర్చల కోసమే వీరు ఒమన్‌ వెళ్లి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్‌ మధ్య అణు చర్చలకు కూడా ఒమన్‌ మధ్యవర్తిగా ఉన్న విషయం తెలిసిందే..! మరోవైపు ఇజ్రాయెల్‌ అనుకూల హ్యాకర్ల గ్రూప్‌ ‘ప్రిడేటరీ స్పారో’ బుధవారం ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్‌చేంజ్‌(నోవిటెక్స్‌)పై సైబర్‌ దాడి జరిపింది. ఇరాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు నోవిటెక్స్‌ నిధులను సమకూరుస్తోందని ఈ గ్రూప్‌ ఆరోపించింది. ఇదే బృందం మంగళవారం బ్యాంకులపై పంజా విసిరిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 19 , 2025 | 02:43 AM