Pakistan: రైలు హైజాక్
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:23 AM
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు రైలును హైజాక్ చేశారు. 9 బోగీలతో, 500 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రె్‌సను మంగళవారం సాయుధులైన దుండగులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘటన
రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్
ఎక్స్‌ప్రె్‌సను హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ
రైలుపై తొలుత కాల్పులు జరిపిన సాయుధులు.. పలువురికి గాయాలు
పౌరులను వదిలేసి.. భద్రతా సిబ్బంది
సహా 214 మందిని బంధించిన బీఎల్‌ఏ సైనిక చర్య చేపడితే అందర్నీ చంపేస్తాం
జైళ్లలో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి
పాక్ సర్కారుకు బీఎల్‌ఏ అల్టిమేటం హెలికాప్టర్లు, డ్రోన్లతో పాక్ ఆపరేషన్
80 మందిని విడిపించినట్లు వార్తలు
150 మందికి పైగా సైనికుల దుర్మరణం
మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ వెల్లడి
కరాచీ, మార్చి 11: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు రైలును హైజాక్ చేశారు. 9 బోగీలతో, 500 మందికి పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రె్‌సను మంగళవారం సాయుధులైన దుండగులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మార్గంలో 17 సొరంగాలు ఉంటాయని పాక్ రైల్వే అధికారులు తెలిపారు. 8వ నంబరు టన్నెల్ వద్ద వారు రైలును అడ్డుకున్నారని చెప్పారు. తొలుత సాయుధ దుండగులు రైలుపై భారీస్థాయిలో కాల్పులు జరిపారని బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించారు. పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. బీఎల్‌ఏ తీవ్రవాదులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. వెంటనే వారు రైలుపై కాల్పులు జరిపి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ దాడిలో 30 మంది పాక్ సైనికులు మరణించినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది.
రైల్లో ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులు.. ప్రధానంగా బలూచిస్థాన్‌కు చెందిన వారిని వదిలిపెట్టి, వారిని సురక్షిత మార్గాల్లో గమ్యస్థానాలకు పంపినట్లు తెలిపింది. ప్రస్తుతం 214 మంది (ఇందులో 100 మందికిపైగా పాక్ భద్రతా సిబ్బంది) బందీలుగా ఉన్నట్లు తెలిపింది. తమపై ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే.. బందీలందరినీ చంపేస్తామని బెదిరించింది. ఘటనా స్థలానికి సహాయక, భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పాక్ ఆర్మీ సిబ్బంది, వైద్యులతో ఎమర్జెన్సీ రైలును పంపినట్లు అధికారులు తెలిపారు. బందీలను కాపాడేందుకు సైనిక చర్య ప్రారంభించామని, చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేవరకు ఇది కొనసాగుతుందని భద్రతా బలగాలు వెల్లడించాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో బాంబు దాడులకు దిగినట్లు సమాచారం. అయితే భద్రతా బలగాలు వైమానిక దాడులను ఆపకపోతే బందీలను చంపేస్తామని బీఎల్‌ఏ హెచ్చరించింది. ఇదిలా ఉండగా పాక్‌కు చెందిన మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ బలూచ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బందీలను విడిపించేందుకు బీఎల్‌ఏతో పోరాటానికి దిగిన పాక్ సైనికుల్లో 150 మందికి పైగా మరణించినట్లు చెప్పారు.
జైళ్లలో ఉన్న బలూచిస్థాన్ ఉద్యమకారులందరినీ విడిచిపెట్టాలని బీఎల్‌ఏ డిమాండ్ చేసింది. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని పాక్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 214 మంది బందీల్లో పాకిస్థాన్‌కు చెందిన మిలిటరీ, పారామిలిటరీ, పోలీస్, నిఘా అధికారులు ఉన్నట్లు తెలిపింది. 48 గంటల్లోగా బలూచిస్థాన్ రాజకీయ ఖైదీలు, ఇతర ఉద్యమకారులను విడిచిపెట్టకపోతే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది.
వేర్పాటువాదుల వరుస దాడులు..
బలూచిస్థాన్ వేర్పాటువాదులు పాక్‌లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే మార్గాలు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. గత నవంబరులో క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మరణించారు. 62 మంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు ఇరాన్, అఫ్ఘానిస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. బలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుతూ బీఎల్‌ఏ 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. పాక్‌తో పాటు అమెరికా, యూకేలు బీఎల్‌ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. చైనా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపెక్) బలూచిస్థాన్ గుండా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సీపెక్ తోడ్పడుతుందని పాకిస్థాన్ పేర్కొంటుండగా.. తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదో ఎత్తుగడ అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
80 మంది బందీలను విడిపించాం
జాఫర్ ఎక్స్‌ప్రె్‌సలో బీఎల్‌ఏ చెరలో ఉన్న వారిలో 80 మందిని విడిపించినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహింద్ రింద్ తెలిపారు. రైల్లోని ఒక బోగీ నుంచి 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులను రక్షించినట్లు వెల్లడించారు. రైలు ఇంకా టన్నెల్‌లోనే ఉందని, భద్రతా బలగాలకు బీఎల్‌ఏ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్లో ఇంకా 400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారన్నారు.