Satya Nadella: కరువు నేలలో ‘ఏఐ’ సేద్యం
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:52 AM
నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని బారామతిలోని బట్టీస్ షిరాలా ప్రాంతంలో సన్నకారు రైతులు ఏఐ సాయంతో మంచి దిగుబడిని సాధించినట్టు ‘ఎక్స్’లో ఆయన తెలిపారు. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.
రైతు వీడియోను పంచుకున్న సత్య నాదెళ్ల
మహారాష్ట్రలోని బారామతిలో ఉష్ణోగ్రతలు,
భూసారంపై డేటాను వాడుకుని
అధిక ఉత్పాదకత సాధించిన ఓ చెరుకు రైతు
టెక్నాలజీ సత్తా ఇది: మైక్రోసాఫ్ట్ సీఈవో
ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుంది: మస్క్
వాషింగ్టన్, ఫిబ్రవరి 24: వ్యవసాయానికి కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టించిన ఓ రైతు వీడియోను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పంచుకున్నారు. కరువు, నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని బారామతిలోని బట్టీస్ షిరాలా ప్రాంతంలో సన్నకారు రైతులు ఏఐ సాయంతో మంచి దిగుబడిని సాధించినట్టు ‘ఎక్స్’లో ఆయన తెలిపారు. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ‘‘ఏఐ ప్రతిదానినీ మెరుగుపరుస్తుంది’’ అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిజానికి, బారామతిలో గత రెండేళ్లుగా మైక్రోసాఫ్ట్ వ్యవసాయ ప్రయోగాలు చేస్తోంది. కరువు, అప్పులు, విపరీతంగా పురుగుమందుల వినియోగంతో పెరిగిన పెట్టుబడి వ్యయాలు, ఆత్మహత్యలతో ఈ ప్రాంత రైతులు దీనస్థితిలో ఉండేవారు.

వారి పంటలను తెగుళ్లు ఆశించేవి ఈ పరిస్థితుల్లో ఇక్కడి సాగులోకి ఏఐ పరికరాలను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ప్రాంత ఉష్ణోగ్రతలు, భూసారంపై ఏఐ అందించిన సమాచారం ఆధారంగా చెరుకు పంట వేసి ఓ రైతు మంచి ఫలితాలు సాధించారు.
తక్కువగా దొరికే నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పురుగుమందుల వాడకం బాగా తగ్గించి ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తిని ఆయన తీయగలిగారని సత్య నాదెళ్ల తెలిపారు. భారత వ్యవసాయ రంగంలో ఏఐ సమర్థ వర్తింపునకు ఇది మంచి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ రంగంపై కూడా ఏఐ వేయగల ప్రభావానికి ఇదొక అద్భుత ఉదాహరణ. బారామతి సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న రైతులకు ఏఐపై అవగాహన కల్పించాం. శక్తివంతమైన ఈ సాంకేతికను ఎలా వినియోగించుకోవాలో తెలియజేశాం. డ్రోన్లు, శాటిలైట్లు అందించిన భౌగోళిక ప్రాదేశిక సమాచారాన్ని వారు వాడుకున్నారు. తమ సేద్యాన్ని మెరుగుపరుచుకున్నారు’’ అని సత్య నాదెళ్ల వివరించారు. అగ్రికల్చర్ డెవల్‌పమెంట్ ట్రస్ట్ (ఏడీటీ) సాయంతో బారామతిలో మైక్రోసాఫ్ట్ ఈ ప్రయోగాలు చేపడుతోంది.
బారామతిలో ఏఐ వినియోగం ఇలా..
మైక్రోసా్‌ఫ్టకు చెందిన అజూర్ డేటా మేనేజర్ ఫర్ అగ్రికల్చర్ (ఏడీఎంఏ) సహకారంతో డేటా ఆధారిత పరిష్కారాలకు మార్గం సుగుమమైంది. శాటిలైట్లు, వాతావరణ కేంద్రాలు, సాయిల్ సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రైతులకు వారి భూమి గురించి సమగ్రమైన అవగాహన కల్పించారు. నేలలోని తేమ, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, పోషకస్థాయిలు ఇలా అన్ని రకాల వివరాలనూ అగ్రిపైలట్.ఏఐ అనే మొబైల్ యాప్ ద్వారా రైతులకు అందించారు. ఈ సమాచారమంతా స్థానిక భాషలోనే ఉండడంతో రైతులకు దాన్ని అర్థం చేసుకోవడం తేలికైంది. ఏఐ లాగరిథమ్స్ ఈ డేటాను విశ్లేషించి విత్తనాలు ఎప్పుడు నాటాలి, ఏ సమయంలో ఎంత నీరందించాలి, తెగుళ్ల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను రియల్‌టైమ్‌లో విశ్లేషించి రైతులకు తెలియజేసింది.
పెరిగిన దిగుబడి.. తగ్గిన ఖర్చులు..
బారామతి వ్యవసాయంలో కృత్రిమ మేధ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సక్రమమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల పంట దిగుబడులు 20 శాతం పెరిగాయి. ఎరువుల ఖర్చులు 25 శాతం తగ్గాయి. నీటి వినియోగం 8 శాతం తగ్గింది. మెరుగైన పర్యవేక్షణ, నిర్వహణ ఫలితంగా కోత అనంతర నష్టాలు 12 శాతం తగ్గాయి. ఇవన్నీ రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వనరుల వృథాను, రసాయనాల వాడకాన్ని తగ్గించాయి. తద్వారా పర్యావరణ సుస్థిరతకు ప్రోత్సాహం అందించినట్టయింది.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.