Putin to Visit India: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటన ఖరారు
ABN , Publish Date - Aug 29 , 2025 | 09:37 PM
చైనాలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సోమవారంనాడు చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
మాస్కో: భారత్-మాస్కో మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin) డిసెంబర్‌లో ఇండియాలో అధికారిక పర్యటన జరుపనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ శుక్రవారంనాడు ధ్రువీకరించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
చైనాలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సోమవారంనాడు చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
పుతిన్ పర్యటనను ధ్రువీకరించిన అజిత్ డోబాల్
పుతిన్ భారత పర్యటననను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సైతం గత నెలలో ధ్రువీకరించారు. అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదని చెప్పారు. రష్యా-భారత్ మధ్య ప్రత్యేకమైన, చిరకాల మైత్రీసంబంధాలు ఉన్నాయని, వీటికి తామెంతో విలువనిస్తామని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తుండటంతో ట్రంప్ భారత్‌పై అదనంగా మరో 25 శాతం సుంకాలను విధించిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అజిత్ డోబాల్ ఇటీవల రష్యా వెళ్లారు. ద్వైపాక్షిక ఇంధన, రక్షణ సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. రష్యా నుంచి డిస్కౌంట్‌లో భారత్ చమురు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ లాభాలకు అమ్ముకుంటోందని ట్రంప్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. రష్యా వార్ మిషన్‌లో ఎంతమంది ప్రజలు ఉక్రెయిన్‌లో చనిపోయేరో భారత్‌కు ఏమాత్రం పట్టింపులేకుండా పోయిందని ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు. సుంకాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అయితే ట్రంప్ ఆరోపణలను భారత్ ఖండిస్తూనే, ప్రజల అవసరాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని తిప్పికొడుతోంది.