Donald Trump: ఫిబ్రవరి 6 కల్లా ఆఫీసులకు రాని వారి ప్రభుత్వోద్యోగాలు పోయినట్టే.. తేల్చి చెప్పిన ట్రంప్
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:05 PM
వర్క్ ఫ్రం హోం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి 6 కల్లా కార్యాలయాలకు తిరిగి రాని పక్షంలో వారు తమ ఉద్యోగాన్ని కల్పోయినట్టేనని డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ ప్రోగ్రామ్‌ను కూడా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వోద్యోగుల వర్క్ ఫ్రం హోం విధానానికి మంగళం పాడాలని కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వారికో అల్టిమేటమ్ జారీ చేశారు. ఫిబ్రవరి 6 నాటికి కార్యాలయాలకు తిరిగి రాని వారి ఉద్యోగాలు పోయినట్టేనని అన్నారు. ‘‘ఫిబ్రవరి 6 నాటికి వారు కార్యాలయాలకు రాకపోతే వారిని తొలగించినట్టే. అప్పుడు ప్రభుత్వ సిబ్బంది సంఖ్య తగ్గించాలన్న మా లక్ష్యం కూడా నెరవేరినట్టవుతుంది. సిబ్బంది సంఖ్యను తగ్గించాలని గత 10 అమెరికా అధ్యక్షులు తీవ్రంగా ప్రయత్నించి చివరకు విఫలమయ్యారు’’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
మరోవైపు, ప్రభుత్వోద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణవైపు ప్రోత్సహించేలా సిబ్బంది వ్యవహారాల శాఖ తాజాగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న వారికి సెప్టెంబర్ 30 వరకూ పని చేయకపోయినా జీతాలు చెల్లిస్తామని చెప్పింది. అయితే, ఫిబ్రవరి 6లోపే ఉద్యోగులు రాజీనామా చేసేదీ లేనిదీ తేల్చుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమచారం అందించినట్టుగా కూడా తెలుస్తోంది.
రాబోయే 2 దశాబ్దాల్లో బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారొచ్చు: యూకే మాజీ మంత్రి
‘‘చాలా మంది ఆఫీసులకు రారు అని మేము అనుకుంటున్నాం. ఆ లెక్కన ప్రభుత్వ సిబ్బంది తగ్గుతుంది. తద్వారా ఉత్పాదకత, సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వోద్యోగంలో ఉండగా మరో ఉద్యోగం చేయలేదని ఉద్యోగులు రుజువు చేసుకోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ అన్నారు.
ఇక ప్రభుత్వ పథకానికి అంగీకరించిన స్వచ్ఛంద పదవీవిరమణకు ఒప్పుకున్న వారికి ప్రభుత్వ అనేక బెనిఫిట్స్ అందించనుంది. సెప్టెంబర్ 30 వరకూ వారికి జీతాలు చెల్లించినా పని చేయాల్సిన అవసరం ఉండదు. కచ్చితంగా ఆఫీసుకు రావాలన్న నిబంధన వారికి వర్తించదు. వారి బాధ్యతలను మరొకరికి అప్పగించడం లేదా తొలగించడం జరుగుతుంది. అమెరికా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నా మరో సంస్థలో జాబ్ చేసే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది.
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటి ప్రశ్న వైరల్
ఇక రాజీనామాకు సంబంధించి ఫిబ్రవరి 6 డెడ్‌లైన్ మిస్సయిన వారు మరో అవకాశం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరచ్చు. అయితే, ఈ అభ్యర్థనకు సంబంధిత శాఖ అనుమతించాల్సి ఉంటుంది. ఇక రాజీనామాను ఎంచుకున్నాక ఆ తరువాత తమ నిర్ణయాన్ని కావాలనుకుంటే ఉపసంహరించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
For International News And Telugu News