Putin: మిత్ర దేశమైన ఇరాన్‌ను ఎందుకు ఆదుకోవట్లేదంటూ ప్రశ్న.. రష్యా అధ్యక్షుడి సమాధానం ఏంటంటే..
ABN , Publish Date - Jun 23 , 2025 | 01:31 PM
మిత్ర దేశమైన ఇరాన్‌ను ఎందుకు ఆదుకోవట్లేదంటూ ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సవివరమైన సమాధానం ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ఏకాకిగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అల్లాడుతోంది.. అయినా మిత్ర దేశం రష్యా ఎందుకు మిన్నకుండిపోతోంది.. ఇదీ ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల్లో తలెత్తుతున్న సందేహం. ఇదే ప్రశ్నను ఓ రిపోర్టర్ నేరుగా రష్యా అధ్యక్షుడి ముందు ప్రస్తావించారు. రష్యా స్నేహధర్మంపై సందేహాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరంలో ఎదురైన ఈ ప్రశ్నకు పుతిన్ సవివరంగా బదులిచ్చారు.
‘మాజీ సోవియట్ యూనియన్, రష్యా ఫెడరేషన్‌కు చెందిన సుమారు 2 మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. దీంతో, అదో రష్యన్ దేశంగా కనిపిస్తోంది. అందుకే తటస్థంగా ఉండాల్సి వస్తోంది. అదే సమయంలో మేము రష్యా చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకుంటాము’ అని అన్నారు.
రష్యా స్నేహ ధర్మాన్ని ప్రశ్నిస్తున్న వారి సందేహాలను కూడా ఆయన తోసి పుచ్చారు. వీళ్లందరూ రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అరబ్ దేశాలతో పాటు ఇస్లామిక్ దేశాలతో కూడా తమకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. రష్యా జనాభాలో 15 శాతం మంది ముస్లింలేనని కూడా తెలిపారు. ఇస్లామిక్ దేశాల సహకార కూటమిలో కూడా తాము పరిశీలక దేశంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది బాధ్యతారాహిత్యం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. పరిస్థితిని ప్రమాదకరంగా దిగజారుస్తూ ప్రాంతీయ స్థిరత్వం, భద్రతలను దెబ్బతీస్తున్నారని మండిపడింది.
ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమీట్రీ మెద్వెదేవ్ కూడా హెచ్చరించారు. ట్రంప్ చర్యల కారణంగా అమెరికా మరో యుద్ధంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇరాన్, రష్యా మధ్య ఎంతో కాలంగా గట్టి దౌత్య సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ రష్యా ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
ఇరాన్ వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
మరిన్ని అంతర్జాతీయ, బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి