Donald Trump: డెమొక్రాట్లకు నిధులిస్తే తీవ్ర పరిణామాలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:15 AM
ఎన్నికల్లో ఆర్థికంగా అండదండలు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో సంబంధం ముగిసిందని అంగీకరించారు.
మస్క్‌కు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక
ఆయనతో బంధం ముగిసినట్టేనన్న ట్రంప్
వాషింగ్టన్, జూన్ 8: ఒకప్పటి తన కీలక మద్దతుదారు, ఎన్నికల్లో ఆర్థికంగా అండదండలు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో సంబంధం ముగిసిందని అంగీకరించారు. తన ప్రత్యర్థులైన డెమొక్రాట్లకు నిధులు అందజేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయనను హెచ్చరించారు. తన ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయ నియంత్రణ బిల్లుకు మద్దతు ఇస్తున్న రిపబ్లికన్లను సవాలు చేసే డెమొక్రాటిక్ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. అయితే ఆ పరిణామాలు ఏమిటో ఆయన వివరించలేదు. శనివారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ప్రముఖ నాయకుల మధ్య గత వారం రోజులుగా బహిరంగంగానే విమర్శల యుద్ధం నడుస్తోంది. విద్యుత్తు వాహనాలపై రాయితీలు తగ్గింపు సహా ప్రభుత్వ వ్యయంలో కోత విధిస్తూ ట్రంప్ బిల్లు తీసుకొచ్చారు. ‘ఇదొక పెద్ద సుందరమైన చట్టం’ అని ట్రంప్ అభివర్ణించారు. మస్క్ మాత్రం ఇది రోత, అసహ్యం కలిగించేదని విమర్శించారు. ట్రంప్ విధానాలు తిరోగమనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. ట్రంప్ అభిశంసనకు మద్దతు ఇస్తానంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టి అనంతరం తొలగించారు. దీనిపై ట్రంప్ కూడా ఘాటుగానే స్పందించారు. అధ్యక్ష పదవిని మస్క్ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. ఆ కుబేరునిలో అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మస్క్ విమర్శల కారణంగా రిపబ్లికన్లలో ఎప్పుడూ లేనంత ఐకమత్యం కనిపిస్తోందని తెలిపారు. మస్క్ వ్యాపారాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్లు రాగా, వాటి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని ట్రంప్ అన్నారు. ప్రముఖ విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. మస్క్‌దే కావడం గమనార్హం. విద్యుత్తు వాహనాలకు ఇస్తున్న రాయితీలను ట్రంప్ ఎత్తివేయడంతో అసంతృప్తి చెందిన మస్క్ ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News