Phoenix Restaurant Mass Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు దుర్మరణం
ABN , Publish Date - May 05 , 2025 | 07:46 PM
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫీనిక్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం రాత్రి రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ దారుణం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఫీనిక్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి కాల్పులు చోటుచేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడి వెనక పలువురు నిందితులు ఉండి ఉంటారని గ్లెనెడేల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అనుమానిస్తోంది.
ఎల్ కమెరూన్ జైగాంటే మారిస్కోస్ అండ్ స్టేక్‌హౌస్ అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రాత్రి 7.45 సమయంలో అక్కడ ఓ కార్యక్రమం జరుగుతుండగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటన సమాచారం అందగానే తమ బలగాలు అక్కడికి చేరుకున్నట్టు గ్లెనెడేల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. అక్కడ అనేక మంది గాయాలతో అచేతనంగా పడి ఉన్నట్టు తెలిపారు.
ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించారని, గాయపడ్డ ఐదుగురికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ దాడి వెనక పలువురు షూటర్లు ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు నిషేధం విధించారు. అనంతరం, ఫారెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో శాంపిల్స్ సేకరించాయి.
అసలు ఏం జరిగిందో తెలిసిన ప్రత్యక్ష సాక్ష్యులు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక నిందితులు కాల్పులు జరపడానికి కారణం తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల పలు సందర్భాల్లో అనేక మంది అమెరికన్లు తుపాకీ సంస్కృతికి బలైపోయిన విషయం తెలిసిందే. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావట్లేదని అనేక మంది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, గత 50 ఏళ్లల్లో సుమారు 1.5 మిలియన్ల మంది సామాన్య అమెరికా పౌరులు ఈ గన్ కల్చర్‌కు బలయ్యారు. అమెరికా జనాభా 330 మిలియన్లు కాగా తుపాకీల సంఖ్య మాత్రం 400 మిలియన్లు దాటిపోయింది. అమెరికా చట్టాల ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారు చిన్న తుపాకులు, రైఫిల్స్ కొనుగోలు చేయొచ్చు. 21 ఏళ్లు నిండితే ఇతర రకాల ఆయుధాలు సొంతం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్ వెళ్లిపోతా.. పాక్ సీనియర్ నేత
భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
Read More Latest Telugu News and International News