Share News

Ryanair Fire alert Scare: స్పెయిన్ విమానంలో ఫైర్ అలర్ట్.. రెక్కలపై నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:53 PM

స్పెయిన్ ఎయిర్‌పోర్టులోని ఓ విమానంలో ఫైర్ అలర్ట్ పొరపాటున మోగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్కల పై నుంచి కిందుకు దూకేశారు. వీరిలో కొందరు గాయాలపాలై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

Ryanair Fire alert Scare: స్పెయిన్ విమానంలో ఫైర్ అలర్ట్.. రెక్కలపై నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు
Ryanair fire alert Spain

ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పాల్మా డీ మలార్కా ఎయిర్‌పోర్టులో రయానెయిర్‌కు చెందిన బోయింగ్ విమానంలో అగ్ని ప్రమాద అలర్ట్ పొరపాటున జారీ కావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ఫ్లైట్ రెక్కల మీద నుంచి కిందకు దూకేశారు. శనివారం విమానం అమెరికాకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టెకాఫ్‌కు కొన్ని క్షణాల ముందు ఫైర్ అలర్ట్ మోగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు (Palma de Mallorca airport panic).

విషయం తెలియగానే వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది విమానం వద్దకు చేరుకున్నారు. నాలుగు అంబులెన్సులు, బేసిక్ లైఫ్ సపోర్టు యూనిట్లు, అక్కడకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్టు అగ్నిమాపక సిబ్బందితో పాటు సివిల్ గార్డ్స్ కూడా విమానం వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని ప్యాసెంజర్‌లను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తీసుకొచ్చి ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్స్ ద్వారా కిందకు దించారు. ఈ క్రమంలో కొందరు ప్యాసెంజర్లు ప్రాణభయంతో విమానం రెక్కల మీదకొచ్చి కిందకు దూకేశారు.


పొరపాటున ఫైర్ అలర్ట్ మోగడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రయానెయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, విమానం నుంచి బయటపడే క్రమంలో 18 మంది గాయాలపాలయ్యారని రీజినల్ ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. వీరికి తక్షణ వైద్యసాయం అందించామని తెలిపింది. ఆరుగురిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించినట్టు వెల్లడించింది.

గత వారం అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. విమానం గాల్లో ఉండగా ఓ ఇంజెన్‌లో మంటలు చెలరేగడంతో టేకాఫ్ అయిన కాసేపటికే లాస్‌వేగస్ ఎయిర్‌‌పోర్టుకు ఎమర్జెన్సీగా తిరిగి రావాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఇవీ చదవండి:

జపాన్‌లో అగ్నిపర్వత విస్ఫోటనం.. ఆ జోస్యం నిజం కానుందంటూ జనాల్లో గుబులు

జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 06:02 PM