Share News

LUMS - Sanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..

ABN , Publish Date - Dec 12 , 2025 | 07:51 PM

పాక్‌లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ ప్రవేశపెట్టిన సంస్కృతం కోర్సు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంస్కృతంపై విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు అక్కడి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.

LUMS - Sanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..
LUMS - Sanskrit Course Pakistan

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన తరువాత తొలిసారిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌లో సంస్కృతం కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఈ కోర్సును ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్ షహీద్ రషీద్ ముందుండి నడిపిస్తున్నారు (Sanskrit Course - Lahore University of Management Sciences).

మొదట్లో సంస్కృతంపై మూడు నెలల పాటు నిర్వహించిన వర్క్‌షాపునకు మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సును ప్రారంభించామని తెలిపారు. 2027 నుంచి ఏడాది కాల వ్యవధి గల పూర్తిస్థాయి కోర్సును కూడా అందించే యోచనలో ఉన్నామని అన్నారు. దక్షిణాసియా ఉమ్మడి సాహిత్య చరిత్ర తెలుసుకునే దిశగా ఇది కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సంస్కృతం అంటే ఏదో ఒక మతానికి సంబంధించినది కాదని, ఈ ప్రాంత ఉమ్మడి సాంస్కృతిక చరిత్ర అని అన్నారు.


విద్యార్థులు తొలుత సంస్కృతం నేర్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారని ప్రొఫెసర్ చెప్పారు. కానీ భాష వ్యాకరణం ఒకసారి అర్థమయ్యాక వారిలో మక్కువ పెరిగిందని అన్నారు. ఉర్దూ భాషపై సంస్కృతం ప్రభావాన్ని తెలుసుకుని విద్యార్థులు ఆశ్చర్యపోయారని చెప్పారు. ‘మేము సంస్కృతం ఎందుకు నేర్చుకోకూడదు. ఈ ప్రాంతాన్ని అంతటినీ ఒక్కటి చేసిన భాష ఇది. సంస్కృత వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన పాణిని గాంధార రాజ్యంలో ఉండేవారు. ఆయన నివసించిన ప్రాంతం ప్రస్తుతం ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రాంతంలో ఉంది’ అని చెప్పారు.

సంస్కృత దస్త్రాలు అనేకం తమ వద్ద ఉన్నాయని యూనివర్సిటీలోని గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డా. ఉస్మాన్ ఖాస్మీ తెలిపారు. కానీ అధ్యయనకర్తలు వాటిపై ఇప్పటివరకూ దృష్టిసారించలేదని అన్నారు. ఇకపై పరిస్థితి మారుతుందని, రాబోయే 10-15 ఏళ్లల్లో భగవద్గీత, మహాభారతాల్లో తర్ఫీదు పొందిన స్కాలర్స్ పాక్‌లో ఉంటారని కూడా చెప్పారు.


ఇవీ చదవండి:

కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 12 , 2025 | 08:05 PM