Bangladesh: పతనం అంచున బంగ్లా సర్కార్.. యూనస్ ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:44 PM
ఢాకాలో శనివారం మధ్యాహ్నం హాదీ అంత్యక్రియలకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల మేరకు హాదీ భౌతికకాయాన్ని బంగ్లా జాతీయ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే పూడ్చిపెట్టారు.
న్యూఢిల్లీ: బంగ్లేదేశ్ వరుస హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపిస్తామని మహమ్మద్ యూనస్ సర్కారు హామీ ఇచ్చినా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఇంకిలాబ్ మోంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ ఇటీవల అగంతకుని కాల్లుల్లో తీవ్రంగా గాయపడ్డారు. గురువారంనాడు సింగపూర్‌లో చికిత్స పొందుతూ అతను కన్నుమూయడంతో పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకోవడం, శనివారం అంత్యక్రియలు జరగనున్నట్టు ప్రకటించడంతో ఢాకాలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హాదీ హత్యకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. గడువులోగా అరెస్టు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఆందోళనకారులు తాజాగా అల్టిమేటం ఇచ్చారు.
'సహనం నశించింది. అంత్యక్రియలు కూడా ముగిసాయి. నిందితులపై చర్యలకు ఇంకెంతో సమయం లేదు. 24 గంటల్లో హంతకులను అరెస్టు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం' అని హాదీ మద్దతుదారులు హెచ్చరించారు. ఢాకాలో శనివారం మధ్యాహ్నం హాదీ అంత్యక్రియలకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల మేరకు హాదీ భౌతికకాయాన్ని బంగ్లా జాతీయ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే పూడ్చిపెట్టారు. ఉదయం నుంచే అంత్యక్రియలకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్లమెంటు వెలుపల జనం కిక్కిరిసిపోయారు. హాదీని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలని, న్యాయం జరగాలని పెద్దఎత్తున ఆందోళనకారులు నినాదాలు చేశారు.
హాదీ మృతితో శనివారంనాడు దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించారు. జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సరిహద్దు గార్డులు, పోలీసు బలగాలను పార్లమెంటు భవనం వద్ద, ఢాకాలోని కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్ మళ్లీ అగ్నిగుండంవిద్యార్థి నాయకుడు హాదీ హత్యతో తీవ్ర ఉద్రిక్తతలు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు శిక్ష