Share News

Earthquake at Japan: జపాన్‌లో భూకంపం.. అండమాన్‌లోనూ ప్రకంపనలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:12 PM

జపాన్‌లో భూ ప్రకంపనలు మరోసారి అల్లకల్లోలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో అక్కడ మూడుసార్లు సునామీ కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేశారు అక్కడి అధికారులు.

Earthquake at Japan: జపాన్‌లో భూకంపం.. అండమాన్‌లోనూ ప్రకంపనలు

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో భూకంపం(Earthquake in Japan) సంభవించింది. ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. భూకంపం అనంతరం.. ఆ దేశంలో మూడు చిన్నపాటి సునామీలూ(Tsuami) సంభవించాయి. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించారు.


స్థానిక కాలమానం ప్రకారం.. తొలి సునామీ ఆదివారం సాయంత్రం ఇవాటే(Iwate) ప్రావిన్సులోని మియాకోలో సంభవించినట్టు జపాన్ వాతావరణ సంస్థ(Japan Meteorological Agency) తెలిపింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఒమినాటో ఓడరేవు(Ominato port), మియాకో(Miyako), కమైషి(Kamaishi)లను తాకినట్టు పేర్కొంది. దీని ఎత్తు సుమారు 10 సెంటీమీటర్లు ఉంటుందని వెల్లడించింది. ఇక మూడోసారి మరింత తీవ్రంగా సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తులో కుజి(Kuji) తీరప్రాతంను తాకిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాటే తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అక్కడి అధికారులు. ఏ క్షణంలోనైనా అలలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు.


అండమాన్‌లోనూ ..

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోనూ(Andaman Islands) ఆదివారం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌(JRCGS) పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే.. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ మాత్రం దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా నమోదైనట్టు తెలిపింది. పోర్టుబ్లెయిర్‌కు ఈశాన్యంలో 147 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Updated Date - Nov 09 , 2025 | 06:12 PM