Share News

Israel: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఒప్పందం రేపు అమల్లోకి!

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:02 AM

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

 Israel: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఒప్పందం రేపు అమల్లోకి!

నేడు ఆమోదించనున్న నెతన్యాహు కేబినెట్‌

టెల్‌ అవీవ్‌, జనవరి17: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్‌ కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. నెతన్యాహు కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపితే ఆదివారం(ఈ నెల 19) నుంచి ఇది అమల్లోకి రానుంది. ఒప్పందం అమల్లోకి వస్తే 470 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడుతుంది. బుధవారం ఒప్పందం కుదిరినా చివరి దశలో కొన్ని చిక్కులు రావడంతో మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా- ఖతార్‌ వీటిని పరిష్కరించినట్లు తెలిసింది. మొత్తం 33 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టనుంది. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంతమంది ఖైదీలను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టనుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హమాస్‌ వద్ద ఇంకా ఎంతమంది ఇజ్రాయెల్‌ పౌరులు బంధీలుగా ఉన్నారనేది కూడా తెలియరాలేదు. కాగా, యుద్ధంలో ధ్వంసమైన గాజా తిరిగి కోలుకోవడానికి 350 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 18.5 బిలియన్ల అమెరికా డాలర్ల నిధులు కనీసంగా అవసరమవుతాయని తెలిపింది.

Updated Date - Jan 18 , 2025 | 05:02 AM