అణు పరికరాల్లో బాంబులు!
ABN , Publish Date - Jan 16 , 2025 | 06:14 AM
ఇరాన్ అణు కార్యక్రమాలను ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుంటోందా? లెబనాన్‌లో హిజ్బుల్లా నేతలే లక్ష్యంగా పేజర్, వాకీటాకీ బాంబులను పేల్చిన ఇజ్రాయెల్.. ఇరాన్‌పైనా అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలని కసరత్తు చేసిందా?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ వ్యూహం
(సెంట్రల్ డెస్క్): ఇరాన్ అణు కార్యక్రమాలను ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుంటోందా? లెబనాన్‌లో హిజ్బుల్లా నేతలే లక్ష్యంగా పేజర్, వాకీటాకీ బాంబులను పేల్చిన ఇజ్రాయెల్.. ఇరాన్‌పైనా అలాంటి వ్యూహాన్నే అమలు చేయాలని కసరత్తు చేసిందా? ఏకంగా ఇరాన్ అణు కార్యక్రమాల పరికరాల్లో ఐఈడీలను అమర్చిందా? టెహ్రాన్ అణు కార్యక్రమాలను తన నియంత్రణలోకి తెచ్చుకుని, అణ్వాయుధాలు, ఇతర అణు ప్రాజెక్టులను ఏ క్షణాన్నైనా పేల్చేసేందుకు వ్యూహం రచించిందా?? ఈ ప్రశ్నలకు ఇరాన్ ప్రభుత్వం అవునని చెబుతోంది. తాము అణు కార్యక్రమాల కోసం కొనుగోలు చేసిన కవ్వాలు(సెంట్రల్ ఫ్యూజ్)కు సంబంధించిన ప్లాట్‌ఫారాల్లో ఇజ్రాయెల్ అమర్చిన బాంబులను గుర్తించామని ఇరాన్ వ్యూహాత్మక వ్యవహారాల ఉపాధ్యక్షుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ‘ఇరాన్ ఇంటర్నేషనల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘‘ఈ చర్య మా భద్రత సవాళ్లను తీవ్రతరం చేసింది’’ అని ఆయన వివరించారు. అయితే.. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎలా గుర్తించారు? అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. 2020లో ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంలో సెంట్రల్ ఫ్యూజ్‌లు పేలిపోయి, భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..! 2021లోనూ నాటాన్జ్ అణు కేంద్రంపై సైబర్ దాడి జరిగింది. అప్పట్లో ఇరాన్ ఈ ఘటనలను ‘న్యూక్లియర్ టెర్రరిజం’ అని అభివర్ణించింది. తాజాగా జరీఫ్ చేస్తున్న ఆరోపణలు 2021లో కొనుగోలు చేసిన సెంట్రల్ ఫ్యూజ్‌కు సంబంధించినవని ఇరాన్ పత్రికలు చెబుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజక్షియాన్ కూడా దీనిపై పరోక్షంగా స్పందించారు. ఎన్‌బీసీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం పట్ల ఆసక్తి చూపడం లేదన్నారు.