Share News

Russia oil imports: రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను ఆపేస్తే చమురు దిగుమతులు భారమే

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:57 AM

రష్యా నుంచి భారత్‌ భారీగా ముడిచమురును కొనుగోలు చేస్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Russia oil imports: రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను ఆపేస్తే  చమురు దిగుమతులు భారమే

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్‌ బిల్లు రూ.78 వేల కోట్లు

  • వచ్చే ఏడాది రూ.1.05 లక్షల కోట్లు

  • ఎస్‌బీఐ నివేదిక అంచనా

న్యూఢిల్లీ, ఆగస్టు 8: రష్యా నుంచి భారత్‌ భారీగా ముడిచమురును కొనుగోలు చేస్తుండటం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్నారు. అయినా భారత్‌ మాత్రం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇస్తోంది. అయితే అమెరికా సుంకాలను క్రమంగా పెంచుతున్న తరుణంలో రష్యా నుంచి భారత్‌ ముడిచమురు కొనుగోళ్లను నిలిపివేస్తే ఏమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. మన దేశానికి రష్యా డిస్కౌంట్‌ ధరలకు ముడిచమురును విక్రయిస్తోంది. ఒకవేళ రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ నిలిపివేసినట్టయితే దేశ చమురు దిగుమతి బిల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్స రం (2025-26)లో మిగిలిన కాలానికి దాదాపు 900 కోట్ల డాలర్లు (దా దాపు రూ.78,822 కోట్లు) పెరగడానికి అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేస్తోంది. ఈ బిల్లు 2026-27 సంవత్సరంలో 1,200 కోట్ల డాలర్ల వరకు కూడా పెరగవచ్చని చెబుతోంది. ఇది భారత్‌కు పెనుభారంగానే చెప్పవచ్చు. రష్యా ఆయిల్‌ లేనిపక్షంలో భారత్‌ ఇంధన కొనుగోళ్లు మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశంపై పశ్చిమ దేశాలు ఆంక్ష లు విధించిన విషయం తెలిసిందే. దీని తర్వాత 2022 నుంచి రష్యా చవకగా ముడిచమురును ఆఫర్‌ చేయడంతో భారత్‌ తన అవసరాల కోసం దానిని కొనుగోలు చేస్తోంది. బ్యారల్‌ రష్యన్‌ ఆయిల్‌ ధరను 60 డాలర్లకు పరిమితం చేయడం, తక్కువ ధరకు విక్రయించడం వల్ల భారత్‌ తన ఇంధన బిల్లును భారీగా ఆదా చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రధాన ఆయిల్‌ సరఫరాదారుగా రష్యా మారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండగా.. 2024-25 సంవత్సరంలో ఏకంగా 35.1శాతానికి ఎగబాకింది. పరిమాణం పరంగా చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 245 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల(ఎంఎంటీ) ముడిచమురును దిగుమతి చేసుకోగా.. ఇందు లో 88 ఎంఎంటీ ముడిచమురు ఒక్క రష్యా నుంచే రావడం గమనార్హం. కానీ పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసినట్టయితే దేశ ముడిచమురు దిగుమతి బిల్లు 900 కోట్ల డాలర్లు, వచ్చే సంవత్సరంలో దాదాపు 1170 కోట్ల డాలర్లు పెరగవచ్చని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది.


ధరలు ఎందుకు పెరుగుతాయంటే?

ప్రపంచ ముడిచమురు సరఫరాలో రష్యా వాటా ప్రస్తుతం 10 శాతంగా ఉంది. రష్యా నుంచి పలు దేశాలు ఒక్కసారిగా చమురు కొనుగోళ్లను నిలిపివేసి.. ఇతర దేశాలు తమ ఉత్పత్తిని పెంచని పక్షంలో ముడిచమురు ధరలు దాదాపు 10 శాతం పెరగవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేస్తోంది. పెరిగే ధరల వల్ల ఒక్క భారత్‌పైనే కాకుండా ప్రతి ఒక్క దేశంపైనా ప్రభావం పడటానికి అవకాశం ఉందంటున్నారు.

భారత్‌ ఏం చేయవచ్చంటే?

ఇంధన అవసరాల కోసం భారత్‌ 85ు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ సహా దాదాపు 40 దేశాల నుంచి ముడిచమురును సమకూర్చుకుంటోంది. గయానా, బ్రెజిల్‌, కెనడా వంటి దేశాలు కొత్తగా చేరడంతో భారత్‌ ఇంధన భద్రత మరింత మెరుగుపడింది. రష్యా ఆయిల్‌ లేకున్నా భారత్‌ ఇతర దేశాలతో ఉన్న సంబంధాలతో తన డిమాండ్‌కు సరిపడా ముడిచమురును సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగితే దేశ దిగుమతుల వ్యయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.

Updated Date - Aug 09 , 2025 | 04:57 AM