Share News

Five Al Jazeera Journalists: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఐదుగురుజర్నలిస్టుల మృతి

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:00 AM

గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన తాజా బాంబు దాడుల్లో అల్‌ జజీరా సంస్థకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు

Five Al Jazeera Journalists: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఐదుగురుజర్నలిస్టుల మృతి

  • గాజాలో ఆస్పత్రి ఆవరణలో మీడియా టెంట్‌పై బాంబులు

  • తీవ్రంగా గాయపడి మరణించిన అల్‌ జజీరా పాత్రికేయులు, ఇద్దరు పౌరులు

  • ఇజ్రాయెల్‌ దారుణాలను వెల్లడిస్తున్నందుకే చంపుతున్నారు: అల్‌ జజీరా

  • గాజాలో గత 22 నెలల్లో 200 మంది జర్నలిస్టుల మృతి

గాజా, ఆగస్టు 11: గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన తాజా బాంబు దాడుల్లో అల్‌ జజీరా సంస్థకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు సహా మొత్తం ఏడుగురు మరణించారు. ఆదివారం అల్‌ షిఫా ఆస్పత్రి ఆవరణలోని మీడియా టెంట్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఆస్పత్రి ప్రధాన ద్వారం కూడా ధ్వంసమైందని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటివ్‌ డైరెక్టర్‌ రమీ మొహన్న తెలిపారు. మృతుల్లో తమ సంస్థ కరస్పాండెంట్లు అనస్‌ అల్‌ షరీఫ్‌, మొహమ్మద్‌ ఖ్రీకె, కెమెరామెన్‌ ఇబ్రహీం జహీర్‌, మోమెన్‌ అలీవా, మొహమ్మద్‌ నౌఫల్‌ ఉన్నట్టు అల్‌ జజీరా సంస్థ తెలిపింది. అయితే, మృతుల్లో ఒక ఉగ్రవాది ఉన్నాడని ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది. అనస్‌ అల్‌ షరీఫ్‌ కొంతకాలం హమాస్‌ ఉగ్రవాద సెల్‌కు అధ్యక్షుడిగా పనిచేశాడని తెలిపింది. జర్నలిస్టు ముసుగులో అతడు ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించాడని పేర్కొంది. ఇజ్రాయెల్‌ పౌరులపైనా, ఐడీఎఫ్‌ దళాలపైనా రాకెట్‌ దాడులు జరగడానికి అతనే కారణమంది. ఇజ్రాయెల్‌ ఆరోపణలను అల్‌ జజీరా సంస్థ ఖండించింది. గాజాలోని పరిస్థితులను ప్రసారం చేస్తున్నందుకే జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేసిన తాజా బాంబు దాడులను మరణానికి కొన్ని క్షణాల ముందు తన ‘ఎక్స్‌’ ఖాతాలో కూడా షరీఫ్‌ పోస్టు చేశాడు. ‘నా ఈ మాటలు మీకు చేరేసరికి.. నన్ను, నా గళాన్ని అంతమొందించడంలో ఇజ్రాయెల్‌ విజయవంతమవుతుంది’ అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ వార్తను ప్రసారం చేసే సమయంలో అల్‌ జజీరా టీవీ చానల్‌ యాంకర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ దాడిని ఐరాస మానవ హక్కుల కార్యాలయం కూడా ఖండించింది. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించిందని పేర్కొంది. మరోవైపు గాజాపై గత 22 నెలలుగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో సుమారు 200 మంది జర్నలిస్టులు మరణించినట్టు మీడియా పేర్కొంది.

Updated Date - Aug 12 , 2025 | 04:00 AM