Elon Musk: 140 మిలియన్ డాలర్ల జరిమానా.. అగ్గిమీద గుగ్గిలమవుతున్న ఎలాన్ మస్క్
ABN , Publish Date - Dec 07 , 2025 | 07:38 PM
ఈయూ నిబంధనలు ఉల్లంఘించినందుకు 140 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ మండిపడుతున్నారు. యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేసి అధికారాలను సభ్య దేశాలకు బదలాయించాలని పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) 140 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంపై సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మండిపడుతున్నారు. ఈయూను రద్దు చేయాలంటూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇంకెంతకాలం ఈయూ ఉనికిలో ఉంటుంది’ అంటూ పోస్టు పెట్టిన మస్క్.. ‘ఈయూను రద్దు చేయాలి’ అన్న హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. సభ్య దేశాలకు మళ్లీ అధికారాలు దక్కేలా ఈయూను రద్దు చేయాలని కామెంట్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని సరిగా ప్రతిబింబించేలా సభ్యదేశాల అధికారాలను పునరుద్ధరించాలని అన్నారు (Elon Musk on EU Penalty).
డిజిటల్ సర్వీస్ యాక్ట్‌లోని పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎక్స్‌పై ఈయూ ఏకంగా 140 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఎక్స్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ మార్కు కేటాయించే విధానం తప్పుదారి పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. దీని వల్ల యూజర్లు స్కామ్స్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే బ్లూ టిక్ మార్కును కేటాయించేవారు.
ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ఈ టిక్ మార్కును ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, అడ్వర్‌టైజ్‌మెంట్‌కు సంబంధించిన డేటాను ఎక్స్ బహిరంగ పరచకపోవడం, పరిశోధకులకు కూడా కొన్ని రకాల డేటాను అందుబాటులో ఉంచకపోవడంతో ఈయూ ఈ జరిమానాను విధించింది. ఈ విషయంలో ఈయూ గతంలో ఎక్స్‌ను పలుమార్లు హెచ్చరించింది. హానికారక కటెంట్‌పై చర్యలు అసంపూర్ణంగా ఉన్నాయని ఓమారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మస్క్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏమిటీ ఈయూ
రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అంశాల్లో ఐరోపా దేశాల మధ్య సహకారం, శాంతిస్థాపన కోసం యూరోపియన్ యూనియన్ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కూటమిలో సభ్య దేశాల సంఖ్య 27. ఐరోపా ఎగుమతిదిగుమతులు, ఆర్థిక పరపతి విధానం, వాణిజ్య విధానం వంటి అంశాల్లో ఈయూ చేసిన నిబంధనలను సభ్య దేశాలు పాటించాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు.. పాక్‌కు షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి