Trump Calls Pakistan Afghanistan: డోస్ పెంచిన ట్రంప్.. 9వ యుద్ధాన్ని ఆపడానికి రెడీ..
ABN , Publish Date - Oct 18 , 2025 | 02:55 PM
పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా సులువైన పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకు తాను 8 దేశాల మధ్య యుద్ధం ఆపానని, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తొమ్మిదవది అవుతుందని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డోస్ పెంచారు. దేశాల మధ్య యుద్ధాలు ఆపటంలో తనకు తానే సాటి అని నొక్కి వక్కాణిస్తున్నారు. యుద్ధాలు ఆపటం అంటే తనకు మహా ఇష్టం అని అంటున్నారు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఆపటం తనకు చాలా సులభమని చెబుతున్నారు. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపాను.
పాకిస్తాన్ - అప్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని నేను అనుకుంటే అది నాకు చాలా సులభం. ఓ వైపు నాకు దేశాన్ని నడపాల్సిన బాధ్యత ఉంది. కానీ, నాకు యుద్ధాలు ఆపటం అంటే భలే ఇష్టం. రువాండా, కాంగో యుద్ధం కావచ్చు.. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం కావచ్చు. నేను యుద్ధాన్ని ఆపిన ప్రతీ సారి ‘మీరు ఇంకో యుద్ధాన్ని ఆపారంటే నోబెల్ బహుమతి వస్తుంది’ అని అంటూ ఉన్నారు.
కానీ, నాకు మాత్రం నోబెల్ రావటం లేదు. నేను మనుషుల ప్రాణాలు కాపాడటం కోసం యుద్ధాలు ఆపుతున్నాను. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ యుద్ధం మాత్రం తొమ్మిదవది అవుతుంది. యుద్ధం ఆపిన అధ్యక్షుడు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. జార్జ్ బుష్ ఓ యుద్ధం చేశారు. కానీ, నేను మిలియన్ల మంది జనాల ప్రాణాలు కాపాడాను’ అని అన్నారు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం గురించి కేవలం వైట్‌హౌస్‌లో మాత్రమే కాదు.. ఎక్కడికెళ్లినా తప్పకుండా చెబుతున్నారు. ఇండియా మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్ని మొదటి నుంచి ఖండిస్తూనే వస్తోంది. ట్రంప్ కారణంగా యుద్ధం ఆపలేదని చెబుతోంది.
ఇవి కూడా చదవండి
అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి
రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం: బీఆర్ఎస్ నేతలు