H-1B Visa: అమెరికాకు.. ఇప్పుడొద్దులే!
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:06 AM
ఇంజినీరింగ్ చేసిన చాలా మంది విద్యార్థుల కల.. అమెరికా. ఎంఎస్ పేరిట విమానం ఎక్కేయడం... ఎంఎస్ పూర్తి చేసేలోగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించడం... వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం.

హైదరాబాద్ సిటీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ చేసిన చాలా మంది విద్యార్థుల కల.. అమెరికా. ఎంఎస్ పేరిట విమానం ఎక్కేయడం... ఎంఎస్ పూర్తి చేసేలోగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించడం... వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం. అయితే, ఈ కల చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే హెచ్1బీ వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ యూఎస్ సిటిజన్‌షి్‌ప అండ్ ఇమిగ్రేషన్ సర్వీసె్‌సకు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953. గత ఏడాదితో పోలిస్తే ఇది 38.6ు తక్కువ. హెచ్1బీ దరఖాస్తుల్లో భారత్ నుంచి వచ్చినవి గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. మొత్తంగా, వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచీ తగ్గుదల భారీగా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.
అప్పట్లో టాప్-3లో హైదరాబాద్
ట్రంప్ 2.0 ప్రారంభం కావటానికి ముందు.. మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాలలో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హెచ్1బీ వీసాల కోసం గతంలో కనిపించిన పోటీ ఇప్పుడసలు లేనే లేదంటున్నాయి పలు కన్సల్టెన్సీలు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, హెచ్1బీ వీసాల ఫీజు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయటం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడటం వంటి పరిణామాలే దీనికి కారణమని చెబుతున్నాయి. ఏదోరకంగా అమెరికాకు వెళ్లి నష్టపోయే బదులు కొన్నాళ్లపాటు వేచి ఉండటమే ఉత్తమమని పలువురు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ ట్రీ అనే కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు శ్రీకర్ ఆలపాటి మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తుండటం కూడా మన విద్యార్థులను ఆలోచింపజేస్తోందన్నారు. డ్రాప్ బాక్స్ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులు కూడా వీసాలు రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందికరంగా మారాయని క్వాలిటీ థాట్ గ్రూపు చైర్మన్ రమణ భూపతి తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలను మాత్రమే పునరుద్ధరించుకునేందుకు అవకాశమిస్తారు. ఈ వ్యవధి గతంలో 48 నెలల వరకు ఉండేది. ఒక పాస్‌పోర్ట్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేయాలనే నిబంధన కూడా వీసా దరఖాస్తుల్లో తగ్గుదలకు కారణమైందని ఐడీఐ కన్సల్టెన్సీ ప్రతినిధి రూపేశ్ తెలిపారు. గతంలో కంపెనీలు కూడా తమ ఉద్యోగులను.. 2-3 ఏళ్ల అనుభవం ఉంటే చాలు హెచ్1బీ వీసా ఇచ్చి పంపేవారని, ఇప్పుడు పదేళ్ల అనుభవం ఉన్న వారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.
ప్రత్యామ్నాయాలున్నాయ్
ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాలంటే హెచ్1 బీ వీసా మాత్రమే కాదు, ఇంకా పలు అవకాశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎల్ 1 వీసా. ఇది ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్ వీసా. బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికాలోని తమ శాఖలకు బదిలీ చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ తదితర రంగాల నిపుణులకు ఓ1 వీసాలు మంజూరవుతాయి. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులకు ఎఫ్ 1 వీసాలు, బిజినెస్ విజిటర్స్‌కు బీ 1, పని ఆధారిత శిక్షణ, ఇంటర్న్‌షిప్స్ టీచింగ్ కోసం జే 1, వ్యాపారవేత్తలకు ఈ-2 వీసాను మంజూరు చేస్తారు.