Share News

China: అర్హత ఉంటేనే.. సోషల్‌ మీడియా కామెంట్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:05 AM

నేటి టెక్‌ యుగంలో సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి.

China: అర్హత ఉంటేనే.. సోషల్‌ మీడియా కామెంట్‌

  • చట్టాలు, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలి

  • డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్‌ లైసెన్స్‌ లేదా సర్టిఫికేషన్‌ వంటి ఆధారాలు చూపాలి

  • సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు చైనా కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: నేటి టెక్‌ యుగంలో సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకొనేందుకు తగిన అర్హతలు లేకుండానే క్రియేటర్లు ఆరోగ్య సూచనల నుంచి ఆర్థిక పరమైన అంశాలపై వరకు సూచనలు చేస్తుంటారు. వారు చెప్పేవన్నీ నిజమని కొంత మంది భావిస్తుంటారు. ఈ విధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో చైనా పలు కీలక నియంత్రణలు తీసుకొచ్చింది. ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థికం వంటి కీలక అంశాలపై ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే తగిన అధికారిక అర్హత ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు ఈనెల 25 నుంచి ‘కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్‌ చట్టం’ ఆ దేశంలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇన్‌ఫ్లూయెన్సర్లు పైన పేర్కొన్న అంశాలపై పోస్టులు చేయాలంటే తమ నైపుణ్యానికి సంబంఽధించిన డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్‌ లైసెన్స్‌ లేదా సర్టిఫికేషన్‌ వంటి ఆధారాలు చూపాల్సి ఉంటుందని మొరాకో న్యూస్‌ నివేదించింది. నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు, తప్పుదారి పట్టించే సలహాల నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా (సీఏసీ) పేర్కొంది. క్రియేటర్ల వివరాలు, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత డౌయిన్‌ (టిక్‌టాక్‌ చైనా వెర్షన్‌), బిలిబిలి, వీబో వంటి సామాజిక మాధ్యమ వేదికలపై ఉంటుంది. ఉదాహరణకు అధ్యయనాల నుంచి సమాచారం ఎప్పుడు స్వీకరించారో, వారి వీడియోలు ఏఐ ఆధారిత కంటెంట్‌ను ఎప్పుడు ఉపయోగిస్తాయో ఇన్‌ఫ్లుయెన్సర్లు స్పష్టంగా చెప్పాలి. ‘ఎడ్యుకేషన్‌’ కంటెంట్‌ పేరుతో కోవర్ట్‌ ప్రమోషన్లను నియంత్రించేందుకు మెడికల్‌ ఉత్పత్తులు, సప్లిమెంట్లు, ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రకటనలను సీఏసీ నిషేధించింది.


ప్రామాణికత కోసమా.. నియంత్రణా?

ఆన్‌లైన్‌ కంటెంట్‌పై విశ్వాసాన్ని పెంపొందించడం, కచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇవి డిజిటల్‌ సెన్సార్‌షి్‌పకు కొత్త రూపమని విమర్శకులు చెబుతున్నారు. కొన్ని అంశాలపై ఎవరు చర్చించాలనే దానిపై పరిమితి విధించడం ద్వారా.. స్వతంత్ర గొంతులను ప్రభుత్వం అణచివేయాలని అనుకుంటోందని పలువురు విమర్శిస్తున్నారు. ‘నైపుణ్యం’ అనేదానికి నిర్వచనం అస్పష్టంగా ఉందని, ఆన్‌లైన్‌లో ఎవరు మాట్లాడాలనే దానిపై అధికారులకు అమితమైన అధాకారాన్ని ఇస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో నూతన చట్టాన్ని కొంత మంది చైనీస్‌ నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ఇది ఆన్‌లైన్‌ చర్చలకు మరింత విశ్వసనీయత తీసుకొస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం

Updated Date - Oct 29 , 2025 | 08:52 AM