Share News

US Nightclub Shooting: అమెరికా నైట్‌ క్లబ్ బయట కాల్పులు.. కారులో వచ్చి నిందితుల దురాగతం

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:43 PM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. చికాగోలోని ఓ నైట్ క్లబ్ ముందు నిలబడ్డ వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. కారులో వెళుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

US Nightclub Shooting: అమెరికా నైట్‌ క్లబ్ బయట కాల్పులు.. కారులో వచ్చి నిందితుల దురాగతం
Chicago Nightclub Shooting

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బుధవారం చికాగోలోని రివర్ నార్త్ ప్రాంతంలోగల ఆర్టిస్ లాంజ్ అనే నైట్ క్లబ్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా సుమారు 14 మంది గాయపడ్డారు (Chicago Nightclub Shooting).

రాత్రి సుమారు 11 గంటల సమయంలో వాహనంలో క్లబ్ ముందు నుంచి వెళ్లిన కొందరు అక్కడున్న జనాలపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టు చికాగో పోలీసులు ధ్రువీకరించారు. సుమారు 25 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతులు మృతిచెందినట్టు తెలిపారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.


ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని అన్నారు. అనుమానితుల సమాచారం తెలిసిన వారు వెంటనే తమను సంప్రదించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక కాల్పులకు కారణమేంటో కూడా ఇంకా తెలియరాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఘటనాస్థలం సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా ఘటన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నైట్‌లైఫ్‌కు ప్రసిద్ధి గాంచిన రివర్ నార్త్ ప్రాంతంలో తాజా కాల్పుల ఘటన కలకలానికి దారి తీసింది. నగరంలో పెరుగుతున్న గన్ కల్చర్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

పాప్ స్టార్ మెడికల్ రికార్డులు లీక్.. ఆసుపత్రిపై రూ.1.57 కోట్ల జరిమానా

కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 06:55 PM