Share News

Canada Study Permit: భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా

ABN , Publish Date - Nov 04 , 2025 | 08:32 AM

కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 74 శాతం భారతీయ విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి.

Canada Study Permit: భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా
Canada student Visa Rejection

ఇంటర్నెట్ డెస్క్: వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్‌లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో ఏకంగా 74 శాతం తిరస్కరణకు గురైనట్టు ప్రభుత్వ గణాంకాల్లో తాజాగా వెల్లడైంది. 2023లో ఇదే కాలంలో తిరస్కరణ రేటు కేవలం 32శాతంగా ఉండటం గమనార్హం. ఈ ఆగస్టులో చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో కేవలం 24 శాతం తిరస్కరణకు గురికావడం గమనార్హం. స్థూలంగా చూస్తే మాత్రం ఆ నెలలో సుమారు 40 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించింది (Canada Student Visa Rejection).

భారతీయ విద్యార్థుల వీసా అప్లికేషన్స్‌లో కూడా కోత పడినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2023 ఆగస్టులో 20,900 మంది ఇండియన్ స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది సంఖ్య ఏకంగా 4,515కు పడిపోయింది. 1000 కంటే ఎక్కువ వీసా దరఖాస్తుల ఆమోదం పొందిన దేశాల్లో కేవలం భారత్‌ విషయంలోనే తిరస్కరణ రేటు అత్యధికంగా ఉండటం విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వీసా తిరస్కరణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో కెనడాలో నిజ్జర్ అనే సిక్కు వేర్పాటువాది హత్య ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే, కెనడా వ్యవహారంలో తాము జోక్యం చేసుకున్నామంటూ వస్తున్న ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.


వీసా మోసాలపై ఉక్కుపాదం

వీసా దరఖాస్తుల్లో మోసాలపై కెనడా అధికారులు ఉక్కుపాదం మోపుతుండటంతో తిరస్కరణ రేటు పెరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది. 2023లో అక్కడి అధికారులు దాదాపు 1500 మోసపూరిత ఎక్సెప్టెన్స్ లెటర్స్‌ను గుర్తించారు. వీటిలో అధిక శాతం భారత్ నుంచి వచ్చినవేనని నిర్ధారించారు. ఇక గతేడాది తనిఖీలను కెనడా ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. దీంతో, మొత్తం 14 వేల లెటర్స్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌లల్లో మోసాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.

విదేశీ విద్యార్థులకు అడ్మీషన్ ఇచ్చినట్టు కెనడాలోని విద్యా సంస్థలు ఈ లెటర్ ఆఫ్ ఎక్సెప్టెన్స్‌ను జారీ చేస్తాయి. ఇది ఉంటేనే విద్యార్థి వీసా మంజూరు అవుతుంది. అయితే, భారతీయ దరఖాస్తుల్లో కొన్నింటికి ఫేక్ లెటర్స్‌ను జత చేసినట్టు అధికారులు గుర్తించి ఆయా దరఖాస్తులను తిరస్కరించారు. భారతీయుల తిరస్కరణ రేటు ఎక్కువగా ఉండటంపై కెనడా ప్రభుత్వం స్పందించింది. భారత స్టూడెంట్స్ ప్రతిభావంతులని, కెనడాకు వారి వల్ల ఎంతో లాభం కలిగిందని తెలిపింది. అయితే, వీసా జారీ అంశం కెనడా ప్రభుత్వ అధికారమని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లిష్ టెస్టులో విఫలం.. యూఎస్‌లో భారతీయ ట్రక్ డ్రైవర్లకు షాక్

చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 09:37 AM