Protest Rocks France : 'బ్లాక్ ఎవ్రీథింగ్'.. ఫ్రాన్స్‌లో బీభత్సకాండ
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:49 PM
ప్రపంచ దేశాల్లో అవినీతి, చేతకాని ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. నిన్న నేపాల్, నేడు ఫ్రాన్స్ అడ్డుడికిపోతోంది.'ప్రతిదీ బ్లాక్ చేయి' నినాదంతో ఫ్రాన్స్ దేశంలో ఆరని నిరసన మంటలు మండుతున్నాయి.
పారిస్(ఫ్రాన్స్) సెప్టెంబర్ 10 : ప్రపంచ దేశాల్లో అవినీతి, అక్రమ, చేతకాని ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. హింసాత్మక చర్యలకు సైతం దిగి అధినేతల్ని గద్దెదించేవరకూ పోరాటం చేస్తున్నారు. నిన్న నేపాల్‌లో ఆ దేశ ప్రధాని ఓలి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించి, చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే తరహాలో ఫ్రాన్స్ ప్రజలు సైతం తిరుగుబాటు చేస్తున్నారు. 'ప్రతిదీ బ్లాక్ చేయి' నినాదంతో దేశాన్ని స్థంభింపచేస్తున్నారు.
ఫ్రాన్స్ ప్రజలందరూ ఇవాళ (బుధవారం) పారిస్ నగరం తోపాటు , ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాలలో రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు, ఇళ్లకు నిప్పంటించారు. ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసుల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై తీవ్ర మైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక, 'బ్లాక్ ఎవ్రీథింగ్' పేరుతో జరిగిన నిరసనలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను రేకెత్తించాయి. రాష్ట్రపతి ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనకారులు రోడ్లను నిర్భంధించి, ఇల్లు, కట్టడాలు, వాహనాలు తగులబెట్టి, పోలీసులపై ఎదురు తిరుగుతూ తలపడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజధాని నగరం పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో.. ట్రాఫిక్ అడ్డుకోవడం, బస్సులకు నిప్పు పెట్టడం, రైళ్లు నిలిపివేయడం, విద్యుత్ లైన్లను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ చాట్‌ల ద్వారా వేగంగా వ్యాపించిన ఈ నిరసనలు, నాయకత్వం లేని వికేంద్రీకృత ఉద్యమంగా మారిపోయాయి. ఆర్థిక అసమానతలు, బడ్జెట్ కోతలు, మాక్రాన్ నాయకత్వంపై అసంతృప్తి వంటి విభిన్న డిమాండ్లతో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ నిరసనలు మాక్రాన్ మొదటి టర్మ్‌లో జరిగిన 'యెల్లో వెస్ట్' ఉద్యమాన్ని పోలి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఏకంగా 80,000 మంది పోలీస్ సిబ్బంది మోహరించినా ఈ నిరసనలకు అడ్డుకట్టు వేయలేకపోతున్నారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమం 'అరాచక వాతావరణం' సృష్టించే ప్రయత్నంగా మంత్రి బ్రూనో రిటైల్లో విమర్శించారు. కొత్త ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకార్ను నియామకం నేపథ్యంలో ఈ నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News