Share News

Pak: నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలోనే భారత్‌పై దాడులు.. పాక్ మంత్రి వెల్లడి

ABN , Publish Date - May 14 , 2025 | 05:55 PM

పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారి బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఇటీవల జరిగిన దాడులకు పాక్ దీటైన జవాబిచ్చిందని, దీని వెనుక నవాజ్ షరీఫ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు.

Pak: నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలోనే భారత్‌పై దాడులు.. పాక్ మంత్రి వెల్లడి

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) విజయవంతమైంది. పాక్ దిగిరావడంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. అయితే దీనికి ముందు భారత్‌పై పాక్ మిలటరీ ఆపరేషన్ చేపట్టడం, భారత్ పైచేయి సాధించడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విజయం తాజాగా వెలుగు చూసింది. భారత్‌పై పాక్ చేపట్టిన మిలటరీ యాక్షన్‌ను స్వయంగా పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) డిజైన్ చేసి దానిని అమలు చేయడంతో పాటు దగ్గరుండి పర్యవేక్షించినట్టు ఆ పార్టీ సీనియర్ నేత అజ్మా బుఖారి బయటపెట్టారు.


పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారి బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఇటీవల జరిగిన దాడులకు పాక్ దీటైన జవాబిచ్చిందని, దీని వెనుక నవాజ్ షరీఫ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ''ఇండియాపై చేపట్టిన మొత్తం ఆపరేషన్‌ మాజీ ప్రధానమంత్రి, పీఎంఎల్-ఎన్ చీప్ నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన ఎ,బి,సి,డి తరహా నాయకుడు కాదు. ఆయన సత్తా ఏమిటో ఆయన పనే చెబుతుంది'' అని బుఖారి అన్నారు.


పాక్ మిలటరీ యాక్షన్‌లో నవాజ్ షరీఫ్ పాత్ర ఉందంటూ పాక్ మంత్రి తాజాగా ప్రకటించినప్పటికీ.. ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి దౌత్యమార్గంలో ప్రయత్నించాలని నవాజ్ తరచు సూచిస్తూ వచ్చారు. పాకిస్థాన్ శాంతికాముక దేశమని, శాంతికే ప్రాధాన్యమిస్తుందని, ఇదే సమయంలో తమను తాము కాపాడుకోవడం ఎలాగో కూడా తమకు తెలుసునని గత శనివారం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పేర్కొన్నారు. పాక్ ప్రధానమంత్రిగా మూడుసార్లు పని చేసిన నవాజ్ 1999 కార్గిల్ వార్ సమయంలోనూ అధికారంలో ఉన్నారు. ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో దేశ నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అల్లా దయవల్ల పాకిస్థాన్ గర్వించదగిన నిర్ణయం తీసుకుందన్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీప్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జనరల్ సైయద్ ఆసిమ్ మునిర్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ జహీర్ సింధు, పాక్ సాయుధ బలగాలను అభినందించారు.

Updated Date - May 14 , 2025 | 05:56 PM