Pamban Bridge: పాంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఆంధ్రుడి ప్రతిభ
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:35 AM
దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా పాంబన్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణంలో విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీర్ చక్రధర్ కీలక పాత్ర పోషించారు.

సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా వెంకట చక్రధర్
గుర్ల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన పాంబన్ బ్రిడ్జి దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. రూ.535 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణంలో ఆంధ్రా కుర్రాడి ప్రతిభ కూడా ఉంది. విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన నడుపూరు వెంకట చక్రధర్.. పాంబన్ వారధి నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలో ఇన్‌చార్జి సేనాధిపతిగా విధులు నిర్వహించారు. చక్రధర్ స్వగ్రామం గుర్ల మండలం భూపాలపురం. తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తిచేశాడు. రైల్వే పరీక్షల్లో సత్తా చాటి తర్వాత తమిళనాడు రీజనల్ పరిధిలో జూనియర్ ఇంజనీర్‌గా విధుల్లో చేరాడు. వంతెనల నిర్మాణంపై ఆసక్తిని గమనించిన అధికారులు ‘పాంబన్’ వారధి బాధ్యతలను చక్రధర్‌కు అప్పగించారు. ‘చిన్నప్పటి నుంచి వంతెనలు, రోడ్లు అంటే ఎంతో ఇష్టం. బీటెక్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ శిక్షణ తీసుకునే సమయంలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ వచ్చింది. అందులో బ్రిడ్జి విభాగం ఆప్షన్‌ను ఎంచుకొని ఉద్యోగంలో చేరాను. తొలుత పోస్టింగ్ చెన్నైలో వచ్చింది.
తర్వాత సీనియర్ ఇంజనీర్‌గా పదోన్నతి లభించింది. అదే సమయంలో పాంబన్ కొత్త వంతెన నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో నాకు బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావించా. వంతెన నిర్మాణానికి నా వంతు కృషి చేశా’నని చక్రధర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News