Four Day Week: వారానికి నాలుగు పని దినాల విధానానికి మళ్లిన యూకే కంపెనీలు!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:55 PM
యూకేకు చెందిన దాదాపు 200 కంపెనీలు వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ఎంచుకున్నాయి. దీంతో, ఆయా సంస్థల్లోని ఉద్యోగులు ఇకపై వారానికి నాలుగు రోజులే ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్‌లోని పలు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై వారానికి నాలుగు పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించాయి. బ్రిటన్ పని సంస్కృతి ఆధునికీకరణలో భాగంగా ఏకంగా 200 కంపెనీలు శాశ్వత ప్రాతిపదికన ఈ విధానానికి మళ్లాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాల్లో ఎటువంటి కోతలు ఉండవని కూడా భరోసా ఇచ్చాయి.
ఈ పరిణామం కారణంగా చారిటీస్, మార్కెటింగ్, టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన 5 వేల మంది ఉద్యోగులకు మేలు చేకూరుస్తుందని అంచనా. ఈ విధానానికి సంబంధించి యూకేలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫోర్ డే వీక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తోంది. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ ఏడాది కచ్చితంగా విజయం సాధించాలనుకుంటే ఇలా చేయండి
ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి ఐదు పని దినాల సంస్కృతి పాతబడిపోయిందని సదరు సంస్థ ప్రచార కార్యక్రమాల డైరెక్టర్ జో రైలీ పేర్కొన్నారు. ఇది 100 ఏళ్ల నాటి విధానమని, ప్రస్తుత కాలానికి అనుగూణంగా పని సంస్కృతికి కూడా అప్‌డేట్ అవసరమని వ్యాఖ్యానించారు. కొత్త విధానంలో ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపేందుకు 50 శాతం అదనంగా సమయం లభిస్తుందని అన్నారు.
మరోవైపు, ఈ విధానానికి వివిధ రంగాలకు చెందిన సంస్థలు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్, ప్రజాసంబంధాలు రంగాలకు చెందిన కంపెనీలు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయట. ఇక లండన్‌కు చెందిన 59 సంస్థలు వారానికి 4 పని దినాల విధానానికి అనుకూలంగా ఉన్నాయట.
అయితే, పలు కార్పొరేట్ సంస్థలు మాత్రం ఇందుకు భిన్నమైన పంథాలో వెళుతున్నాయట. ముఖ్యంగా అమెరికాలోని బడా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయట. వారానికి కనీసం 5 రోజులు కార్యాలయాల్లోనే పని చేయాలని చెబుతున్నాయట.
ఇదిలా ఉంటే, 18 - 34 ఏళ్ల మధ్య వారిలో ఏకంగా 78 శాతం మంది వారానికి నాలుగు పని దినాల విధానాన్ని కోరుతున్నట్టు స్పార్క్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జరిపిన ఓ సర్వేలో తేలింది. ఈ వయసుల్లోని వారు మానసిక ఆరోగ్యానికి, సంతృప్తికర జీవనంవైపే మొగ్గు చూపుతున్నారని తేలింది.
For International News And Telugu News