Share News

నోట్లో మెటాలిక్‌ రుచి ఎందుకు..

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:54 PM

నా వయసు 35 ఏళ్ళు. నాకు నోట్లో చాలాసార్లు మెటాలిక్‌ రుచి ఉన్నట్టు ఉంటుంది.ఇలా ఎందుకు అవుతుంది? దీనికి ఆహారంతో ఏదైనా పరిష్కారం ఉందా?

నోట్లో మెటాలిక్‌ రుచి ఎందుకు..

నా వయసు 35 ఏళ్ళు. నాకు నోట్లో చాలాసార్లు మెటాలిక్‌ రుచి ఉన్నట్టు ఉంటుంది.ఇలా ఎందుకు అవుతుంది? దీనికి ఆహారంతో ఏదైనా పరిష్కారం ఉందా?

- అనిత శ్రీ, మహబూబ్‌నగర్‌

మీ సమస్య కొత్తదేమీ కాదు. నోటిలో మెటాలిక్‌ రుచికి దంతాల ఆరోగ్యం సరిగా లేకపోవడం, జలుబు, సైనసైటిస్‌ వంటి సమస్యలు కారణంగా చెప్పొచ్చు. ఇంకా, కొన్ని రకాల మందుల వాడకం, ఆహారం సరిగా అరగకపోవడం, ప్రెగ్నెన్సీ, కొన్ని రకాల విటమిన్‌ మాత్రలు తీసుకోవడం మొదలైన వాటిలో ఏదైనా ఈ సమస్యకు కారణం కావొచ్చు. సమస్య ఎందువల్ల వస్తోందో తెలుసుకొంటే నియంత్రించడం తేలికవుతుంది. ఏదైనా పోషకాల లోపం భర్తీ చెయ్యడానికి విటమిన్‌ మాత్రలు తీసుకొన్నట్లయితే, ముఖ్యంగా ఐరన్‌, జింక్‌ లాంటి ఖనిజాలు ఉండే సప్లిమెంట్లు తీసుకున్నప్పుడు కూడా ఇలా మెటాలిక్‌ టేస్ట్‌ అనిపించవచ్చు కానీ సాధారణంగా ఇది తాత్కాలికమే. అజీర్తి, అసిడిటీ లాంటి జీర్ణ సమస్యల వల్ల ఇలా మెటాలిక్‌ టేస్ట్‌ ఉన్నట్టయితే ఆహారంలోనూ జీవనశైలిలోనూ తగిన మార్పులు చేసుకోవాలి. ఈ సమస్య ఎక్కువ కాలం పాటు కొనసాగినట్టయితే వైద్యులను సంప్రదించి సలహా పొందడం మేలు.


మా అమ్మాయికి ఇరవై ఏళ్ళు. టెస్టులలో ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందని తెలిసింది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- సౌజన్య, వరంగల్‌

ఒకప్పుడు ఫ్యాటీలివర్‌ సమస్య మద్యం తీసుకునే వాళ్లలో అధికంగా కనిపించేది. ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోని వారిలో కూడా ఫ్యాటీ లివర్‌ అధికంగా ఉంటోంది. దీనిని నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ అంటారు. అధిక క్యాలరీలు, ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరానికి మించి ఉన్నప్పుడు ఆ కొవ్వులు లివర్‌ (కాలేయం) పై పేరుకొంటాయి. దీని వలన వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఫ్యాటీ లివర్‌ సమస్యలున్నప్పుడు మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఫ్యాటీ లివర్‌ తగ్గాలంటే బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

book11.2.jpg

ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారు కనీసం ఐదు నుండి పది శాతం బరువు తగ్గితే కూడా చాలా ఉపయోగం ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం అన్నింటికంటే సులువైన పరిష్కారం. దీని కోసం ప్రతి పూటా ఆహారంలో కనీసం రెండు వందల గ్రాముల కూరగాయలు (ఉడికించి లేదా ఏదైనా నూనె తక్కువ వేసిన కూర రూపంలో లేదా సలాడ్‌ రూపంలో) తీసుకోవడం, రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు ఆహారంలో తీసుకోవడం, తెల్ల అన్నానికి బదులు ముడిధాన్యాలు, పాలిష్‌ చెయ్యని చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం, కొవ్వులు అధికంగా ఉండే ఫ్రైలు, స్నాక్స్‌ మానెయ్యడం మొదలైనవన్నీ ఫ్యాటీ లివర్‌ తగ్గేందుకు ఉపయోగపడతాయి. అలాగే, దినచర్యలో వ్యాయామం భాగం చేసుకోవడం, రోజంతా శారీరకంగా కదలిక ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి.


వానాకాలంలో వేడిగా సూప్‌ తాగితే బాగుంటుంది. ఎటువంటి సూప్స్‌ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? సూప్‌లు పిల్లలకూ ఇవ్వొచ్చా?

- హనుమాన్‌, మచిలీపట్నం

book11.3.jpg

సూపుల తయారీకి దాదాపుగా అన్ని కూరగాయలను వాడొచ్చు. క్యారెట్‌, బీట్రూట్‌, క్యాబేజి, క్యాలీఫ్లవర్‌, ముల్లంగి, స్వీట్‌ కార్న్‌, టమాటా, క్యాప్సికం, పుట్టగొడుగులు లాంటి వాటితో సూపులు బాగుంటాయి. పాలకూర, ముల్లంగి ఆకు, పుదీనా, సోయకూర లాంటి ఆకుకూరలతోనూ, చికెన్‌, మటన్‌ లాంటి మాంసాహారంతో కూడా సూపులు చేసుకోవచ్చు. సూపుల్లో కూరగాయలను గ్రైండ్‌ చేసి వేయడం వల్ల అన్ని వయసుల వాళ్లూ తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. పోషకాలు కూడా తేలికగా అందుతాయి. బయట కొన్న సూపులలో చిక్కదనం కోసం మొక్కజొన్న పిండి వాడతారు. దీనిలో పోషకాలు కూడా తక్కువే. అందుకే ఇంట్లో సూపు తయారు చేసుకునేప్పుడు చిక్కదనం కోసం చిన్న బంగాళా దుంప ముక్కను కూడా కూరగాయలతో పాటుగా గ్రైండ్‌ చేసి వేసుకోవచ్చు. వర్షాకాలంలో మసాలా దినుసులైన బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జాజికాయ వంటివి సూపులలో వాడితే రుచికీ, ఆరోగ్యానికీ కూడా మంచిది.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Jun 22 , 2025 | 01:54 PM