Orthostatic Hypotension: అకస్మాత్తుగా లేచి నిలబడితే తలతిరుగుతోందా? బీపీ తగ్గడమే దీనికి కారణమని తెలుసా
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:51 AM
సడెన్‌గా లేచి నిలబడినప్పుడు బీపీ తగ్గడాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అంటారు. దీని వల్ల ఒక్కోసారి తల తిరిగినట్టు అనిపిస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో, నివారణలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: కుర్చీల్లో కూర్చొన్న వారు లేదా బెడ్‌పై పడుకున్న వారు లేచి నిలబడగానే తలతిరిగినట్టు అనిపిస్తుంది. తూలినట్టు అనిపిస్తుంది. కొందరిలో చూపు మసకబారినట్టు కూడా ఉంటుంది. అకస్మాత్తుగా బీపీ పడిపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు (blood pressure drop on standing).
ఏమిటీ హైపోటెన్షన్..
సడెన్‌గా నిలబడిన సందర్భాల్లో గురుత్వాకర్షణ వల్ల రక్తం కాళ్లవైపు వేగంగా ప్రవహిస్తుంది. ఫలితంగా గుండె, మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. బీపీ తగ్గుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుంటాయి. ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతాయి కాబట్టి చాలా సందర్భాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సమయాల్లో మాత్రం ఈ ప్రతిస్పందనలు ఆలస్యం కావడం లేదా తగినంత లేకపోవడం వల్ల బీపీ తగ్గినట్టు అనిపిస్తుంది (orthostatic hypotension).
వృద్ధులు, నీరు తగినంత తాగని వారిలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్ష్ ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల ఔషధాల వల్ల కూడా ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఈ తరహాలో బీపీ తగ్గినప్పుడు తలతిరగటం, అలసటగా అనిపించడం, నీరసం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ఒక్కోసారి మూర్ఛ కూడా వస్తుంది.
నివారణ ఇలా..
ఈ పరిస్థితి తలెత్తుకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం వల్ల ఈ సమస్య చాలా తగ్గుతుంది. వృద్ధులు నెమ్మదిగా లేచి నిలబడితే కూడా ముప్పు తగ్గుతుంది. ఇక స్టాకింగ్స్ వంటి కంప్రెషన్ దుస్తులు ధరించడం కూడా కొంత సాంత్వన కలిగిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచే ఆహార నియమాలను పాటించాలి. ఇక తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి:
కాటరాక్ట్ ముప్పును పెంచే ఫుడ్స్.. వీటి జోలికి అస్సలు వెళ్లొద్దు
స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..