Health: తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:40 PM
అన్ని ఆకుకూరల్లాగానే తోటకూరలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ A, C, K, ఫోలేట్, ఖనిజాలు (ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తహీనత ఎదుర్కొనేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఈ పోషకాలు అత్యవసరం.
తోటకూరతో జీర్ణవ్యవస్థ చురుగ్గా...
తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి?
- భాస్కర్, ఖమ్మం
అన్ని ఆకుకూరల్లాగానే తోటకూరలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ A, C, K, ఫోలేట్, ఖనిజాలు (ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రక్తహీనత ఎదుర్కొనేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు, జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు ఈ పోషకాలు అత్యవసరం. పొటాషియం, మెగ్నీషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచుపదార్ధాల కారణంగా బరువు నియంత్రణకు, మలబద్దకం నివారణకు కూడా ఉపయోగప డుతుంది. తోటకూర ఆకు మాత్రమే కాకుండా గింజల్ని కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతారు. తోటకూర విత్తనాలతో తయారు చేసే పిండితో రొట్టెలు చేస్తారు కూడా. వీటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్ధాలు అధికం.
చలికాలంలో చర్మసంరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
- గాయత్రి, విజయవాడ
చలి కాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ. దీనిని ఎదుర్కోవడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, పిస్తా, ఆక్రోట్, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు వంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవాలి. విటమిన్ సి కూడా చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తి వృద్ధికి అవసరం. నిమ్మ, కమలా, నారింజ, ఆపిల్, జామ, దానిమ్మ మొదలైన తాజా పండ్లన్నీ విటమిన్-సి ని అందిస్తాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా మాయిశ్చరైజర్, ఆలివ్ నూనె, కొబ్బరినూనె వంటివి వాడితే చర్మం పొడిబారదు. పెదవులు పగలకుండా తగినన్ని నీళ్లు తాగాలి. వాజిలిన్ లేదా నెయ్యి రాసుకోవడం మంచిది. శీతాకాలంలో ఆహారాన్ని వేడిగా తీసుకోవాలి. సూప్స్ కూడా తాగితే శరీరానికి కావలసిన నీరు అందుతుంది. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులు వాడడం వల్ల శీతాకాలం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎండ తగిలే అవకాశం తక్కువ కాబట్టి వీలుచేసుకొని రోజుకు కనీసం అరగంటైనా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
నా వయసు 40 ఏళ్లు, జీర్ణక్రియ సాధారణంగానే ఉంది. ఈ మధ్య కాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- రామచంద్ర, ఏలూరు
శరీరంలో ఏ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఉప్పు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు (ప్రాసెస్డ్ ఫుడ్స్), జంక్ ఫుడ్స్, మద్యం వంటివి మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతాయి. వీటిని మితంగా తీసుకోవాలి. మద్యానికి దూరంగానే ఉండాలి. రోజుకు తగినన్ని నీళ్లు తాగాలి. 2-3 లీటర్లకు తగ్గకుండా చూసుకోవాలి. నాలుగైదు లీటర్లకంటే ఎక్కువ తాగవద్దు. శీతల పానీయాలు, తీయటి పండ్ల రసాలు, అధిక మొత్తంలో కాఫీ, టీలను నియంత్రించాలి. తగినంత ప్రొటీన్ ఆహారంలో ఉండాలి.
తక్కువ నూనెతో వండిన మాంసాహారం (మితంగా మాత్రమే), గుడ్లు, పప్పులు, టోఫు (సోయా పనీర్), మీల్ మేకర్ (సోయా చంక్స్) వంటివి తీసుకోవాలి. కాలానుగుణంగా దొరికే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మూత్రపిండాల సమస్యలు రానంతవరకు ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. కానీ ఒకసారి మూత్రపిండాల సమస్య వచ్చాక.. తీవ్రతను బట్టి ఆహార నియమాలు వేరుగా ఉంటాయి. అటువంటప్పుడు కేవలం వైద్యులు, పోషకాహార నిపుణుల సలహాతో మాత్రమే తిండిలో మార్పులు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)