High BP Myths: హైబీపీ.. ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు!
ABN , Publish Date - Mar 10 , 2025 | 07:52 AM
హైబీపీ గురించి జనాల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు మీకూ ఉంటే వెంటనే తొలగించుకోండి. వాస్తావలు ఏంటో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: అదుపులో లేని హైబీపీతో దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయి. స్ట్రోక్ వంటివి వస్తే జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఇంత ప్రమాదకరమైన హైబీపీ విషయంలో దురదృష్టవశాత్తూ కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించుకుని జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలను రెండు చేతులతో ఆహ్వానించినట్టు అవుతుంది. మరి జనాల్లో రక్తపోటుకు సంబంధించి ఉన్న అపోహల ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
హైబీపీ ఉంటే కచ్చితంగా శరీరంలో మార్పులు కనిపిస్తాయని, తద్వారా సమస్యలు ఈజీగానే గుర్తించొచ్చని కొందరు పొరబడుతుంటారు. అయితే, అన్ని సందర్భాల్లో ఇది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి హైబీపీ ఉన్నా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కాబట్టి, క్రమ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటూనే రోగం ముదరకుండా జాగ్రత్త తీసుకోగలుగుతాము.
పెద్ద వయసు వారిలోనే హైబీపీ ఉంటుందన్న అపోహ కూడా తప్పు. పోషకాహార లేమి, ఒత్తిడి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటివి యువతలో కూడా హైబీపీకి కారణమవుతున్నాయి.
Psoriasis and Nutrition: ఈ తరహా ఫుడ్ తింటే సోరియాసిస్‌కు చెక్!
ఒంట్లో బానే ఉంది కాబట్టి బీపీ కంట్రోల్‌లో ఉందని భావించడం కూడా భారీ విపత్తుకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైకి ఎలాంటి రోగ లక్షణాలు లేకపోయినా కూడా అదుపులో లేని బీపీ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
ఒక్క హైబీపీ తప్ప ఇతర రోగాలు ఏమీ లేకపోతే ఫరవాలేదనే భావన కూడా కొందరిలో ఉంటుంది. అయితే, అదుపులో లేని బీపీ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇది చివరకు హార్ట్‌ఎటాక్, కిడ్నీ, కంటి సమస్యలకు దారి తీస్తుంది.
ఉప్పు పూర్తిగా మానేస్తే బీపీ అదుపులో ఉంటుందనుకోవడం కూడా అపోహే. అధిక బరువు, ఒత్తిడి, జన్యుసమస్యలు వంటివన్నీ హైబీపీకి కారణమవుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడమే బీపీకి పరిష్కారం.
Calories burned in Cricket: వామ్మో.. క్రికెట్ ఆడితే ఇన్ని కెలరీలు ఖర్చవుతాయా
మందులు తీసుకుంటున్నాము కాబట్టి బీపీ గురించి చింత అవసరం లేదను కోవడం తెలీకుండానే నిర్లక్ష్యానికి దారి తీస్తుంది. ఔషధాలు తీసుకుంటున్నా కూడా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడం బీపీ నియంత్రణకు అవసరం
కాఫీ, టీలోని కెఫీన్ అనే రసాయనంతో దీర్ఘకాలిక హైబీపీ వస్తుందన్న అపోహ కూడా జనాల్లో ఉంది. ఇది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. కెఫీన్ కారణంగా బీపీ అప్పటికప్పుడు పెరిగినా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయదని భరోసా ఇస్తున్నారు. అయితే, టీ అయినా, కాఫీ అయినా ఓ పరిమితిలో తాగడమే మంచిదని సూచిస్తున్నారు.