Brain Boosting Tips: మెదడుకు పదును ఇలా
ABN , Publish Date - May 06 , 2025 | 03:08 AM
మెదడును చురుగ్గా ఉంచేందుకు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్, వ్యాయామం, ధ్యానం లాంటివి ముఖ్యమైనవి. సామాజిక సంబంధాలు, చేతి మార్పులు వంటి చిన్న అలవాట్లు కూడా మెదడుకు పదును పెంచుతాయి
తెలుసుకుందాం
మెదడు చురుగ్గా ఉంచుకున్నంత కాలం, మతిమరుపు సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వాళ్లు మెదడుకు వ్యాయామాన్ని అందిస్తూనే ఉండాలి. అందుకోసం....
రోజుకొక కొత్త విషయం: కొత్త సమాచారంతో మెదడుకు సవాలు విసురుతూ మెదడును చురుగ్గా ఉంచుకుంటూ ఉండాలి. కొత్త అభిరుచి ఏర్పరుచుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం, కొత్త సంగీత వాయిద్యం సాధన చేయడం లాంటివన్నీ మెదడుకు వ్యాయామాలే! ఇవన్నీ చేయలేనివాళ్లు కొత్త వంటకం వండడం, కొత్త విషయాలను తెలుసుకోవడం లాంటివి చేయొచ్చు.
బ్రెయిన్ గేమ్స్, పజిల్స్: సుడొకు, పజిల్స్ పూరిస్తూ వాటిని నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. ఈ ఆటల కోసం రోజుకు అరగంట కేటాయించడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అయితే రోజూ ఒకే రకమైన బ్రెయిన్ గేమ్స్‌కు బదులుగా ఒక రోజు సుడొకు, ఒక రోజు పదవినోదం, మరొక రోజు అంకెల గారడీ లాంటివి ఆడుతూ ఉండాలి.
ధ్యానం: ధ్యానంతో మానసిక ప్రశాంతత దక్కడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పక ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తితో సంబంధమున్న మెదడులోని హిప్పొపొటమస్ అనే ప్రదేశం బలపడుతుంది.
వాటం మార్చి: కుడి చేతి వాటం ఉన్న వాళ్లు ఎడమ చేతినీ, ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు కుడి చేతినీ వాడుకుంటూ ఉండాలి. బ్రష్‌తో పళ్లు తోముకోడానికీ, చీపురు పట్టుకుని ఊడ్చడానికీ, ఏదైనా అందుకోడానికీ, గరిట తిప్పడానికీ.. ఇలా తేలికపాటి పనుల కోసం చేతి వాటం మారుస్తూ ఉండడం వల్ల మెదడులోని రెండు అర్థభాగాలూ చైతన్యమవుతాయి.
వ్యాయామం: వ్యాయామంతో మెదడు కూడా లాభపడుతుంది. ఏరోబిక్ వ్యాయామంతో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. నడక, ఈత, డాన్స్... ఇవన్నీ మెదడును చురుగ్గా ఉంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.
అనుబంధాలు: సంభాషణ, హాస్యం, అనుబంధాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి స్నేహితులతో కాలక్షేపం చేయడం, కలిసి సినిమాలు చూడడం, చర్చలు జరపడం లాంటివి చేస్తూ ఉండాలి. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవాలి.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..