Recurring Headache Causes: తరచూ తలనొప్పి వేధిస్తోందా.. ఏం కాదులే అనుకుంటే రిస్క్‌లో పడ్డట్టే..
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:51 PM
తరచూ తలనొప్పి వేధిస్తుంటే సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. అంతర్లీనంగా తీవ్ర అనారోగ్యం ఉండి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మిమ్మల్ని తరచూ తలనొప్పి వేధిస్తోందా? మందులు వేసుకున్నా ఎక్కువ రోజులు పాటు నిలిచుంటోందా? తలనొప్పే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే, మీరు రిస్కులో ఉన్నట్టే అని అంటున్నారు వైద్యులు. నిద్ర సిరిపోలేదనో, అలసట లేదా ఒత్తిడి ఎక్కువైందనో అనుకుని నిర్లక్ష్యం చేస్తే సమస్య పెద్దది కావొచ్చని హెచ్చరిస్తున్నారు. తలనొప్పి ఎక్కువకాలం ఉంటోందంటే అంతర్గతంగా పెద్ద సమస్య ఉన్నట్టు అనుమానించాలని హెచ్చరిస్తున్నారు.
తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. మైగ్రేన్, హైబీపీ, సైనస్ ఇన్ఫెక్షన్ల వంటి చిన్న కారణాల కాకుండా మెదడులో ట్యూమర్ వంటి పెద్ద సమస్యలు కూడా తలనొప్పికి దారి తీయొచ్చు. కాబట్టి, పరిస్థితి ఇబ్బంది పెడుతోందని అనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి. సమస్యకు మూలాలు తెలుసుకుని చికిత్స చేయాలి (Recurring Headaches Causes).
రోజూ వాకింగ్ చేసేవారు తెలుసుకోవాల్సిన 2:2:1 ఫార్ములా
పదే పదే వచ్చే తలనొప్పికి కారణాలు..
తలనొప్పి చిన్న సమస్యే అయినా పదే పదే వస్తోందంటే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్ లేదా పార్శ్వ నొప్పి.. సాధారణంగా ఇది తలలో ఒక వైపు మాత్రమే వస్తుంది. కొన్ని గంటల నుంచి రోజుల వరకూ నొప్పి వేధిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారు వెలుతురును చూడలేకపోవడం, వాంతులు, తలతిరుగుతున్నట్టు ఉండటం వంటి సమస్యలు కూడా ఉంటాయి.
హైబీపీ కూడా తలనొప్పికి దారి తీయొచ్చు. బీపీ పెరిగినప్పుడు మెదడులోని నాడులపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది.
ఇక సైనస్ సమ్యలు ఉన్న వారికీ తలనొప్పి సహజమే. ఈ సమస్య ఉన్న వారిలో నుదురు, కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి అనిపిస్తుంది. కంటిపై ఒత్తిడి పెరిగినప్పుడు కూడా తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కంప్యూటర్లు, మొబైల్స్ అతిగా వాడటం ఇందుకు కారణం.
ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
తలనొప్పి తరచూ వేధిస్తోందంటే సందేహించాలని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని ట్యూమర్ కూడా దీనికి కారణం కావచ్చని అంటున్నారు. ట్యూమర్ల కారణంగా తలనొప్పి రోజుల తరబడి వేధించడమే కాకుండా చాలా సందర్భాల్లో తీవ్రతరం అవుతుంది. తలనొప్పితో పాటు వాంతులు, నీరసం, మాట్లాడటం, నడవడంలో ఇబ్బందులు, ఉన్నాయంటే తక్షణం వైద్యులను సంప్రదించాలి.
తరచూ వేధించే తలనొప్పికి సత్వర పరిష్కారంగా బాగా నీళ్లు తాగాలి. అధిక శాతం తలనొప్పి డీహైడ్రేషన్ వల్ల వచ్చే అవకాశం ఉండటంతో నీరు తాగాలని వైద్యులు చెబుతారు. దీనితో పాటు కాఫీ, టీలు, మద్యం, మసాలాలు దట్టించిన ఫుడ్స్ అన్నీ కూడా సమస్యను ముదిరేలా చేస్తాయి. ఇక తలనొప్పి వేధిస్తున్నప్పుడు కంప్యూటర్లు, మొబైల్స్ వంటి వాటిని చూడకపోవడమే మంచిది.