Medications Health Risks: అలర్ట్.. ఈ 3 రకాల మందులను ఎక్కువగా వాడితే ప్రమాదం!
ABN , Publish Date - Oct 13 , 2025 | 02:59 PM
ఎన్‌ఎస్ఏఐడీలు, స్టాటిన్స్, పీపీఇన్‌హిబిటర్స్ అనే మందులు ఎక్కువగా వాడొద్దని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మెడిసిన్స్‌తో వచ్చే సమస్యలు ఏమిటో ఈ కథనంలో ఓసారి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఔషధాలు ఎలాంటివైనా సరే అతిగా వాడితే అనర్థాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రజలు వాడే కొన్ని మందులతో కూడా ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఔషధాలు తరచూ వాడితే మాత్రం రిస్క్‌లో పడ్డట్టే. ఇలా చిక్కులు తెచ్చిపెట్టే కొన్ని మెడిసిన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ స్టీవ్ హాఫార్ట్ అనే ఫార్మసిస్టు పలు సూచనలు చేశారు (Common medicines - Overuasge Risks)
నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్
ఒంటి నొప్పులు తగ్గించే ఐబ్యూప్రూఫెన్, సెలీకాక్సిబ్, నాప్రోక్సెన్ వంటి మందులను (నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) జనాలు ఎక్కువగా వాడుతుంటారు. తక్షణ ఫలితం ఇచ్చే ఈ మందులకు పాప్యులారిటీ ఎక్కువ. అయితే, వీటి సైడ్ ఎఫెక్ట్స్‌ను పేషెంట్లు తక్కువగా అంచనా వేస్తుంటారని స్టీవ్ హాఫార్ట్ చెప్పారు. హాఫార్ట్ చెప్పే దాని ప్రకారం.. దీర్ఘకాలం పాటు ఈ మందులను వాడితే పేగు లోపలి పొరలు దెబ్బతింటాయి. ఇది చివరకు అల్సర్స్, బ్లీడింగ్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. ఈ మందుల వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. నగరాల్లో కిడ్నీ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరగడానికి ఇదీ ఒక కారణం. కాబట్టి ఈ మెడిసిన్స్‌కు బదులు ఆహారంలో మార్పులు చేయడం, పసుపు వినియోగం పెంచడం, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలను తింటే మరింత మెరగైన ఫలితాలు పొందొచ్చు (Pharmacist's Warning).
ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటర్స్
కడుపులో మంటతో ఇబ్బంది పడే వారు ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటర్ అనే ఔషధాలను ఎక్కువగా వాడుతుంటారు. వీటితో కూడా ప్రమాదం లేకపోలేదని హాఫార్ట్ అన్నారు. దీర్ఘకాలం పాటు ఇవి వాడితే కడుపులో జీర్ణరసాలు ఊరడం తగ్గి ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా పోషకాల లోపం తలెత్తి వ్యక్తులు బలహీనపడే ముప్పు పెరుగుతుంది. కాబట్టి, ఈ మందులకు బదులుగా ప్రోబయాటిక్స్ అధికంగా ఉండే పెరుగు లేదా యాపిల్ సిడర్ వెనిగర్ వంటివి తీసుకుంటే కడుపు మంట సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
స్టాటిన్స్
కొలెస్టరాల్ లెవెల్స్‌ను తగ్గించేందుకు వాడే స్టాటిన్స్‌తో గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. అయితే, ఇన్‌ఫ్లమేషన్ అధికంగా ఉన్న వారిలో ఈ మందుల వల్ల విటమిన్ డీ లెవెల్స్ తగ్గే ప్రమాదం ఉంది. కండరాల మెరుగ్గా పనిచేసేందుకు, శక్తి ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్ డీ తగ్గితే పలు రకాల సమస్యల వస్తాయి. టైప్-2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి సమస్యలు, హార్మోన్‌ల అసమతౌల్యత వంటివి తలెత్తుతాయి. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్, కొలెస్టెరాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేందుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడంతోపాటు, జీవన శైలి మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలను వస్తాయి.
ఇవి కూడా చదవండి:
పురుషులకు వేడి నీటి స్నానంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా?
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ