Tips to Manage PCOS and Diabetes: ఈ చిట్కాలతో పీసీఓఎస్, డయాబెటిస్‌ను అదుపు చేయండిలా...
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:21 PM
పీసీఓఎస్ అనేది మహిళల్లో ఇటీవల సాధారణంగా మారిన సమస్య. దీంతో పాటు డయాబెటిస్ బాధితులూ పెరిగిపోతున్నారు. అయితే.. ఈ రెండూ నాణేనికి బొమ్మా-బొరుసులని, చిన్న చిట్కాలను పాటించడం ద్వారా వీటిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS) అనేది మహిళల్లో ఇటీవల కనిపిస్తోన్న ఓ సాధారణ సమస్య. దీని బారిన మహిళలు.. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, జీవక్రియ రుగ్మత, క్రమరహిత రుతుస్రావం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా వ్యంధ్యత్వం, మొటిమలు, జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంతో పాటు ఇటీవలి కాలంలో డయాబెటిస్(Diabetes) బారినపడుతున్న మహిళల సంఖ్యా అధికమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం.. 6-13 శాతం మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. ఇంకా 70 శాతం వరకూ కేసులు నిర్ధారణ కాలేదని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ.
పీసీఓఎస్, డయాబెటిస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసుల్లా.. పరస్పరం అనుసంధానమై ఉంటాయని వైద్య నిపుణులు(Health Experts) అంటున్నారు. పీసీఓఎస్ అనేది అధిక బరువుతో కూడుకున్న సమస్యలా మాత్రమే కనిపిస్తుంది.. కానీ సన్నగా, నాజూగ్గా ఉండే మహిళలతో సహా ఎవరైనా వీటి బారినపడే అవకాశముందన్నారు. ఇది టైప్-2 డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. టైప్-1 డయాబెటిస్ ఉన్న మహిళలు, ముఖ్యంగా అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకునే వారిలో తరచూ పీసీఓఎస్ లక్షణాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే.. కొన్ని చిట్కాల(Tips) ద్వారా వీటిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆ చిట్కాలు ఏంటంటే...
బరువును అదుపులో ఉంచుకోవడం - సాధారణ మహిళలూ 5 నుంచి 10 శాతం వరకూ బరువు తగ్గడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించవచ్చు.
తెలివిగా తినడం - పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం. రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలను తగ్గించాలి.
ఎక్కువగా కదలడం - వ్యాయామం అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నడవడం వంటివి చేయాలి.
నిరంతర పర్యవేక్షణ - క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర(గ్లూకోజ్) పరీక్షలను చేయడం ద్వారా ప్రీడయాబెటిస్‌ను ముందుగానే గుర్తించడంలో సాయపడతాయి.
మందుల వాడకం - వైద్యుల పర్యవేక్షణలో మెట్‌ఫార్మిన్ వంటి మందులు.. ఇన్సులిన్‌ను నిరోధించడంతో పాటు పీసీఓఎస్ లక్షణాలను నియంత్రించేందుకు తోడ్పడతాయి.
నిద్ర, ఒత్తిడి నిర్వహణ - నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి.. ఇన్సులిన్‌ను మరింత తక్కువ చేస్తాయి. కావున యోగా, ధ్యానం, ప్రాణయామం వంటివి చేయడం ద్వారా ఇన్సులిన్ పునరుత్పత్తవుతుంది.
ఇవీ చదవండి: