Share News

పొట్టి గుర్రాలతో థెరపీ..

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:46 PM

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి... ఒక చిన్న ఆత్మీయ పలకరింపు, ఒక స్పర్శ ఎంతో సాంత్వనను అందిస్తుంది. ఎప్పుడైనా సరే... పెంపుడు జంతువులతో కాసేపు గడిపితే ఒత్తిడి ఇట్టే దూరమై, మనసు తేలికపడుతుందంటారు ఆరోగ్య, మానసిక నిపుణులు.

పొట్టి గుర్రాలతో థెరపీ..

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారికి... ఒక చిన్న ఆత్మీయ పలకరింపు, ఒక స్పర్శ ఎంతో సాంత్వనను అందిస్తుంది. ఎప్పుడైనా సరే... పెంపుడు జంతువులతో కాసేపు గడిపితే ఒత్తిడి ఇట్టే దూరమై, మనసు తేలికపడుతుందంటారు ఆరోగ్య, మానసిక నిపుణులు. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకంగా పొట్టి గుర్రాలతో థెరపీ అందిస్తున్నాయి.

ఇంట్లో పెట్స్‌ ఉంటే ఒత్తిడి దరిచేరకుండా ఉంటుందన్నది నిపుణుల మాట. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు గుర్రాలతో కాసేపు స్నేహం చేస్తే ఎంతో ఉపశమనం లభిస్తుందన్నది వైద్యుల మాట. అందుకే ‘హార్స్‌ థెరపీ’ ప్రాచుర్యంలోకి వస్తోంది. దీన్ని ‘ఇక్వైన్‌ థెరపీ’ అని కూడా అంటారు. అయితే థెరపీకి వినియోగిస్తున్నవి సాదాసీదా గుర్రాలు కాదండోయ్‌... థెరపీ గుర్రాలు ప్రత్యేకమైనవి. సాధారణ గుర్రాలు ఐదారు అడుగుల ఎత్తుంటే... ఇవి రెండున్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. ఒకరకంగా ఈ బ్రీడ్‌ కాస్త భిన్నమైనది. ఈ పొట్టి గుర్రాలు ప్రశాంతమైన ప్రవర్తనను కలిగి ఉంటాయి. మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయి. డాగ్‌, క్యాట్‌ థెరపీలాగే హార్స్‌ థెరపీతో అనేక ప్రయోజనాలు చేకూరతాయట.


book11.3.jpg

స్వచ్ఛంద సంస్థల సహకారంతో...

అమెరికాలోని ‘జెంటిల్‌ కరోసిల్‌ మినీయేచర్‌ థెరపీ హార్సెస్‌’ అనే సంస్థ గుర్రాలతో రోగులకు స్వాంతన కలిగించేలా పనిచేస్తోంది. ఈ సంస్థ దగ్గర 25 ప్రత్యేక గుర్రాలున్నాయి. శాండీ హుక్‌ కాల్పులు, ఒక్లాహోమా టోర్నడో ప్రమాదంలో గాయపడినవారు కోలుకునేలా ఈ సంస్థ ‘హార్స్‌ థెరపీ’ని అందిస్తోంది. ‘యూఎఫ్‌ హెల్త్‌ సైకియాట్రిక్‌ హాస్పిటల్‌’, ‘హనీస్‌ మినీ థెరపీ అడ్వెంచరర్స్‌’ సంస్థలు సంయుక్తంగా పొట్టి గుర్రాలతో పిల్లలకు, సైకియాట్రిక్‌ పేషెంట్లకు థెరపీని అందిస్తున్నాయి. బెంగళూరులోని ‘మిరాకిల్‌ ఇక్వైన్‌ సెంటర్‌’ హీలింగ్‌ హార్సెస్‌ పేరుతో థెరపీని అందిస్తోంది. పొట్టి గుర్రాలు చాలా సులభంగా మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ట్యూన్‌ అవుతుంటాయి. చాలా ప్రశాంతంగా, ప్రేమను వ్యక్తం చేస్తూ మనుషులతో ఇట్టే కలిసిపోతాయి.


book11.4.jpg

వీటితో ఇంటరాక్ట్‌ కావడం వల్ల పేషెంట్‌ ప్రవర్తనలో మార్పు వస్తుంది. కొత్త ఆలోచనా విధానాలు వస్తాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మానసికంగా సాంత్వన పొందుతారు.

రోగుల దగ్గరకు థెరపీ హార్స్‌ను అనుభవం, శిక్షణ ఉన్న హ్యాండ్లర్‌ తీసుకుని వస్తారు. థెరపీ సమయంలో హ్యాండ్లర్‌ వెంటే ఉంటారు. రోగులు గుర్రాన్ని ముట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం చేయవచ్చు. సెషన్‌ పూర్తయ్యాక ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. ఈ థెరపీకి హాస్పిటల్‌ సిబ్బంది సహకరిస్తారు. హార్స్‌ థెరపీ వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

Updated Date - Sep 14 , 2025 | 12:46 PM