JN.1 COVID 19 Variant: కొవిడ్ కేసుల పెరుగుదల.. ఏమిటీ జేఎన్.1 కరోనా వేరియంట్
ABN , Publish Date - May 20 , 2025 | 07:49 AM
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు. ఏమిటీ జేఎన్.1 వేరియంట్? భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణం ఇదేనా?
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మే 19 నాటికి మొత్తం 257 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి తీరుతెన్నులపై నిఘా పెట్టారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్‌లో కేసులు పెరుగుతున్నాయి.
భారత్‌లో కొవిడ్ కేసులు ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. ఇక హాంకాంగ్, సింగపూర్ కొవిడ్ కేసులకు ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8 కరోనా వేరియంట్లు కారణమని నిపుణులు నిర్ధారించారు. ఈ రెండు వేరియంట్స్ జేఎన్.1 అనే మరో వేరియంట్ నుంచి పుట్టినవే. అయితే, భారత్‌లో కేసుకు ఏ వేరియంట్ కారణమనేది ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
ఏమిటీ జేఎన్.1 వేరియంట్..
ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచీ జేఎన్.1 వచ్చింది. దీన్ని తొలిసారి 2023 ఆగస్టులో గుర్తించారు. మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఒకటి రెండు అధిక జన్యుఉత్పరివర్తనాల కారణంగా ఈ వేరియంట్‌కు మరింత వేగంగా వ్యాప్తించే సామర్థ్యం వచ్చింది. దీంతో, ఇది రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్‌ఫెక్షన్ కలుగజేస్తోంది. బీఏ.2.86తో పోల్చితే జేఎన్.1లో ఒక మ్యూటేషన్ అదనంగా ఉంది. ఇది వేరియంట్‌లోని స్పైక్ ప్రొటీన్‌లు స్వల్ప మార్పుకు కారణమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తిని తప్పించుకుని ఇన్ఫెక్ట్ చేయగలుగుతోంది అని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
జేఎస్.1 వేరియంట్‌తో వ్యాధి బారిన పడేవారిలో పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కి దిబ్బెడ, అలసట జ్వరం వంటివి కనిపిస్తు్న్నాయి. ఈ వేరియంట్ బారిన పడ్డ వారిలో డయేరియా కూడా ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి నిలకడానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఓ అత్యవసర సమావేశం జరిగింది. అన్ని కేసుల్లో రోగ లక్షణాలు ఓ మోస్తరుగానే ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
40ల్లో ఉన్న మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది
చర్మంలో ఈ మార్పులు కనిపిస్తే ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్టే..
కొందరు 4 గంటల నిద్రతో సరిపెట్టుకోగలరు.. ఇలా ఎందుకో గుర్తించిన శాస్త్రవేత్తలు