Share News

Health Tips: శాండ్విచ్‌లు ఎంతవరకు మేలు..

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:00 AM

శాండ్విచ్‌లను రెండు రొట్టె ముక్కల మధ్యన కూరగాయలు, చికెన్‌, పనీర్‌ లేదా ఆమ్లెట్‌లతో, ఏదైనా సాసులను ఉంచి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం ఈ శాండ్విచ్‌ల తయారీకి వాడే పదార్థాలపై, అలాగే ఎంత పరిమాణంలో తింటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

Health Tips: శాండ్విచ్‌లు ఎంతవరకు మేలు..
Sandwich

మా పాపకి శాండ్విచ్‌ అంటే చాలా ఇష్టం. ఇంట్లో తయారు చేసినా, బయటవైనా వాటినే ఎక్కువ ఇష్టపడుతుంది. శాండ్విచ్‌లు ఆరోగ్యానికి మంచివేనా?

- మాలిని, వైజాగ్‌

శాండ్విచ్‌లను రెండు రొట్టె ముక్కల మధ్యన కూరగాయలు, చికెన్‌, పనీర్‌ లేదా ఆమ్లెట్‌లతో, ఏదైనా సాసులను ఉంచి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం ఈ శాండ్విచ్‌ల తయారీకి వాడే పదార్థాలపై, అలాగే ఎంత పరిమాణంలో తింటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. శాండ్విచ్‌ తయారీకి వాడే బ్రెడ్డు పూర్తి మైదాతో తయారైనదైతే దానిలో పిండి పదార్థాలు తప్ప విటమిన్లు, పీచుపదార్థాలు లాంటి పోషకాలేమీ ఉండవు. మల్టీ గ్రెయిన్‌ లేదా హోల్‌ వీట్‌ (ముడి గోధుమ పిండి)తో తయారు చేసిన బ్రెడ్‌ వాడి నట్టయితే మంచిది. అలాగే ఆ బ్రెడ్‌ స్లైసెస్‌ మధ్యన పెట్టే పదార్థాలు డీప్‌ ఫ్రై చేసినవి, నూనె అధికంగా ఉండేవి కాకుండా... ఉడికించిన లేదా తక్కువ నూనెతో వండిన చికెన్‌ లేదా కీమా, ఆమ్లెట్‌, పనీర్‌ లాంటివి వాడినప్పుడు వాటి నుంచి ముఖ్యమైన పోషకాలైన ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు ఆరోగ్యకరమైన కూరగాయలు (ఉల్లి, టమాటా, క్యాప్సికం, మష్రూమ్స్‌, కీరా మొదలైనవి) కూడా చేరిస్తే పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తోడవుతాయి. టమాటా కెచప్‌, సాస్‌, మయోనీస్‌ లాంటి అధిక క్యాలరీలున్న పదార్థాలను కాకుండా పెరుగు, పుదీనా చట్నీ, గ్రీన్‌ చట్నీ, చాట్‌ మసాలా లాంటివి వాడితే శాండ్విచ్‌లను ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. బయట శాండ్విచ్‌లు చేసేప్పుడు వాటి తయారీలో వాడే పదార్థాల నాణ్యత మనకు తెలీదు కాబట్టి ఇటువంటివి ఇంట్లో చేసుకుంటే మంచిది.


నాకు తరచూ తలనొప్పి వస్తోంది, కళ్ళు లాగినట్టుగా అనిపిస్తోంది. పోషకాల లోపం వల్ల ఇలా జరుగుతోందా? ఆహార జాగ్రత్తలతో నా సమస్య పరిష్కారం అవుతుందా?

- ఆదిత్య, వైజాగ్‌

తరచూ తలనొప్పి, కళ్ళు లాగడం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు లక్షణాలు కావొచ్చు. కారణాన్ని నిర్ధారించకుండా పరిష్కారం చెప్పలేం. ఒక్కోసారి తగినంత నీరు అందక పోవడం వల్ల ఈ ఇబ్బంది రావొచ్చు. ఎక్కువసేపు కంప్యూటర్‌ లేదా ఫోన్‌ స్ర్కీన్‌లను చూడడం వల్ల, లేదా కళ్లద్దాలు అవసరం వచ్చినా గుర్తించకపోవడం కూడా కారణాలు కావొచ్చు. కంటి వైద్యులను సంప్రదించి సమస్య కారణాన్ని తెలుసుకోవడం మంచిది. ఇక ఆహారం విషయాని కొస్తే ల్యుటీన్‌, జియాగ్జాంథిన్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రకోలీ, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే తాజా పళ్ళు, క్యాప్సికం, పాలకూర, విటమిన్‌ ఈ అందించే ముడిధాన్యాలు, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు, ఆకుకూరలు కంటి కణజాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ని అడ్డుకుని ఎక్కువకాలం చూపు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్స్‌ ఒమేగా 3, ఒమేగా 6 లు కూడా కంటి చూపు ఆరోగ్యానికి అవసరమే. చేపలు, గుడ్లు, ఆక్రోట్‌, బాదం, అవిసె గింజలు మొదలైన ఆహారం తీసుకుంటే ఈ ఫ్యాటీ ఆసిడ్స్‌ లభిస్తాయి. విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే ఆహారమైన క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు కంటిలోని రెటీనా ఆరోగ్యానికి అవసరం. జింక్‌ అధి కంగా ఉండే మాంసాహారం, పాలు, బీన్స్‌ లాంటివి ఆహారంలో భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


బెర్రీ పండ్లయిన స్ట్రాబెరీ, బ్లూబెరీ, మల్బరీ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. కానీ ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడానికి అందరికీ వీలుపడదు కదా. ఆ పండ్లలోని పోష కాలు మరేదైనా ఆహారంలో కూడా లభిస్తాయా?

- రాజేశ్వరి, మహబూబ్‌నగర్‌

స్ట్రాబెరీ, మల్బరీ, బ్లూబెరీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌లు, బీపీ, డయాబెటీస్‌ లాంటి జీవన శైలి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. ఈ బెర్రీ పండ్లలో కూడా బ్లూబెరీ లు అధిక మోతాదుల్లో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కానీ, బ్లూబెరీలు మన ప్రాంతాల్లో పండవు కాబట్టి, వీటిని ఇతరప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవడం వల్ల, వీటి ఖరీదు అధికం. స్ట్రాబెరీలు, మల్బరీలు కొంత మేరకు దేశీయంగా లభించినప్పటికీ ఇవి కూడా తక్కువ ఖరీదేమీ కాదు. కానీ, ఈ పండ్లలో లభించే విటమిన్‌ సి, పీచు పదార్థాలు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు మనకు వేరే రకాల ఆహారం నుంచి కూడా లభిస్తాయి. ముఖ్యంగా కాలానుగుణంగా తాజాగా, మనదగ్గరే చవకగా దొరికే అన్ని పండ్లలోనూ ఈ పోషకాలు ఉంటాయి. విటమిన్‌ సి, పీచుపదార్థాలు అధికంగానే ఉంటాయి. ఇక యాంథోసయానిన్స్‌ విషయానికొస్తే ముదురు రంగులో ఉండే రేగుపళ్ళు, నేరేడు పళ్ళు, ఆల్‌ బుఖరా పండ్లలో కూడా ఇవి అధికంగానే లభిస్తాయి. యాంథోసయానిన్స్‌ లాగానే, యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేసే మరెన్నో పదార్థాలు తాజాగా లభించే బత్తాయి, కమలా, నారింజ, జామ, సపోటా, సీతాఫలం, అరటిపండు, యాపిల్‌, నల్ల ద్రాక్ష, బొప్పాయి, పుచ్చ, కర్బుజా వంటి అన్ని రకాల పండ్లలోనూ ఉంటాయి. కేవలం ప్రత్యేకమైన పండ్లు తీసుకొంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది అపోహ. అందుబాటులో ఉన్నపండ్లేవైనా రోజుకు రెండు రకాలను ఆహారంలో భాగం చేసుకొంటే చాలు.

Updated Date - Mar 09 , 2025 | 12:15 PM