Health: సోడియం లెవెల్స్ స్థిరంగా ఉండాలంటే ఎలాంటి ఆహార తీసుకోవాలి...
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:41 AM
రక్తంలో సోడియం తగ్గడం (హైపోనాట్రీమియా) వృద్ధుల్లో సాధారణ మైన సమస్య. సోడియం శరీరంలో నీటి సమతౌల్యానికి, నాడీ, కండరాల పనితీరుకు అవసరం. ఇది తగ్గిపోతే అలసట, బలహీనత, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు వస్తాయి.
మా నాన్న గారికి 80 సంవత్సరాలు. రక్తంలో సోడియం నిలకడగా ఉండదు, తరచుగా తగ్గుతుంది. రక్తంలో సోడియం నిలకడగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి?
- సతీష్, హైదరాబాద్

రక్తంలో సోడియం తగ్గడం (హైపోనాట్రీమియా) వృద్ధుల్లో సాధారణ మైన సమస్య. సోడియం శరీరంలో నీటి సమతౌల్యానికి, నాడీ, కండరాల పనితీరుకు అవసరం. ఇది తగ్గిపోతే అలసట, బలహీనత, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు వస్తాయి. అధికంగా నీరు తాగడం, గుండెకు సంబంధించి లేదా బీపీ నియంత్రించేందుకు వాడే మాత్రల్లో మూత్రవిసర్జన పెంచే మందుల వాడకం, కిడ్నీ పనితీరు తగ్గడం, వాంతులు లేదా విరేచనాలు కావడం లాంటివి ముఖ్యమైన కారణాలు. సోడియం నిలకడగా ఉండాలంటే ఆహారంలో స్వల్పంగా ఉప్పు కలపాలి. సూప్, సాంబార్, రసం, మజ్జిగలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవడం మంచిది. రోజుకు ఒకసారి ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) తాగడం కూడా సహాయపడుతుంది. నీరు మితంగా - రోజుకు సుమారు 2 లీటర్లలోపే తాగాలి. వృద్ధులలో ఈ సమస్య ఉన్నప్పుడు వైద్యుల సలహాలు, సూచనలతోనే ఆహారం, నీటి మోతాదు, మందుల మార్పులు చేయడం మంచిది. సరైన ఆహారం, మితమైన నీటి సేవనం, వైద్య పర్యవేక్షణతో సోడియం స్థాయి నిలకడగా ఉంటుంది.
మా నానమ్మ గారి వయసు 75 సంవత్సరాలు. నడుము నొప్పి వల్ల సరిగా నడవలేక పోతున్నారు, ఇంతకుముందే మోకాలి గుజ్జు అరిగిపోయి కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఈ సమస్యకు పరిష్కారంతో పాటు సరైన ఆహారం తెలుపండి.
- వైశాలి, కందుకూరు
వయస్సు పెరిగేకొద్దీ మోకాళ్ల గుజ్జు అరిగి పోవడం, నడుంనొప్పి లాంటి సమస్యలు సాధారణం. ఇవి ఎముకల బలహీనత, విటమిన్ ఈ, కాల్షియం లోపం వల్ల వస్తాయి. నడవడం, కూర్చోవడం, మెట్లు ఎక్కడం కష్టమవుతుంది. ఉపశమనానికి తేలికైన నడక, యోగా స్ట్రెచింగ్, వేడి నీటి ప్యాక్ లేదా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం మంచిది. ఆహారంలో పాలు, పెరుగు, నువ్వులు, బాదం, మునగ ఆకు, పాలకూర, శనగలు లాంటి పదార్థాలు చేర్చాలి. రోజూ 10-15 నిమిషాలు సూర్యకాంతి తాకేలా ఎండలో కూర్చోవాలి. ఇది విటమిన్ ఈ కోసం అవసరం. అవసరమైతే వైద్యుల సూచనలతో సప్లిమెంట్లను కూడా వాడాలి. నొప్పి నియంత్రణలో ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిదే. ముదురు రంగుల్లో ఉండే ఆకుకూరలు, వంకాయ, బీట్రూట్, కాప్సికం, టమాటా లాంటి కూరగాయలు, దానిమ్మ, బొప్పాయి, పుచ్చ, కర్బుజా, స్ట్రాబెర్రీ, కివీ లాంటి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. సరైన ఆహారం, తేలికైన వ్యాయామం, వైద్య పర్యవేక్షణతో ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు.
సాధారణంగా పాన్‌లా కాకుండా తమలపాకును కరిగించిన నెయ్యిలో వేసుకుని అన్నంలో తింటుంటాం. అసలు తమలపాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
- రశ్మి, విజయవాడ
మన భారతీయ సంప్రదాయ ఆహార సంస్కృతిలో తమలపాకునకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకు. తమల పాకులో విటమిన్ అ, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపులో గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది నోటి దుర్వాసనను తగ్గించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తమలపాకు శరీరానికి చల్లదనం ఇస్తుంది, దగ్గు, జలుబు లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది. అయితే అధిక మోతాదులో తరచుగా తినడం వద్దు; మితంగా, తీసుకుంటే తమలపాకు ఆరోగ్యానికి ఉపయోగకరం.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)