Share News

Snoring Tips: గురక సమస్యను ఈ చిట్కాలతో దూరం చేసుకోండి..

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:05 PM

గురక అనేది చాలా సాధారమైన సమస్యగా మారింది. గురక పెట్టడం వల్ల పక్కన నిద్రించే వారు కూడా ఇబ్బంది పడతారు. అయితే, ఈ సమస్యను కొన్ని చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Snoring Tips: గురక సమస్యను ఈ చిట్కాలతో దూరం చేసుకోండి..
snore

Snoring Tips: గురక సమస్య వల్ల సరిగా నిద్ర పోలేరు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వయసు పెరిగే కొద్దీ గురక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. గట్టిగా గురక పెట్టేవారు స్లీప్ అప్నియా టెస్ట్ ను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్లీప్ అప్నియా అంటే నిద్రపోతున్న సమయంలో సడెన్ గా శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో గురక పెడతారు. చాలా మంది ఇది హానికరం కాదని అనుకుంటారు. అయితే, దీనివల్ల ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే గురక సమస్యను ఈ చిట్కాలతో దూరం చేసుకోండి.

ప్రాణాయామం..

ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి గురక సమస్య ఉన్న వారు ప్రాణాయామం చేయడం మంచిది.

బరువు తగ్గించుకోవాలి..

అధిక బరువు ఉండటం కూడా గురక సమస్యకు కారణం అవుతుంది. శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గేందుకు ప్రయత్నించండి.


సిగరెట్ మానుకోవాలి..

పొగ తాగే అలవాటు ఉన్నవారికి గురక సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యకరమైన సిగరెట్ అలవాటును మానుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తలగడ పెట్టుకోండి..

గురక సమస్య ఉన్న వారు నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల గురక కొంత వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకుంటే మంచిది. అలా పడుకోవడం వల్ల వాయు మార్గాలు తెరిచి ఉంటాయి కాబట్టి కొంతమేరకు గాలి ప్రవాహం సులువుగా జరుగుతుంది.

ఆల్కహాల్ మానుకోవాలి..

గురక సమస్య ఉన్న వారు నిద్రించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఆల్కహాల్ గొంతులోని కండరాలను సంకోచించేలా చేసి గాలి సరిగా ఆడకుండా చేస్తుంది.

గ్లాసు పాలు..

రాత్రిపూట పడుకునే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగితే గురక సమస్య దూరం అవుతుంది.

యాలకుల గింజలు..

గ్లాసు వేడి నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల గింజల పొడిని కలుపుకొని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

నెయ్యి..

వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేసుకున్నా గురక సమస్య తగ్గడంతోపాటు నిద్ర బాగా పడుతుంది.

(Note: ఈ కథనం ఆరోగ్య నిపుణుల సమాచారం మేరకు ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)

Updated Date - Jan 02 , 2025 | 06:05 PM