Yoga During Pregnancy: గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 21 , 2025 | 02:22 PM
ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం మంచిదేనా? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Yoga During Pregnancy: ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. మన జీవనశైలిలో యోగాను భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుంది. యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సీబుల్ గా మారుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కండరాలు బలంగా మారుతాయి. ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించడంలో కూడా యోగా ఉపయోగపడుతుంది. అయితే, ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం మంచిదేనా ? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
గర్భిణీ స్త్రీలు యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. యోగా గర్భధారణ సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే, యోగా ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని, ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
సులభమైన ప్రసవం:
నిపుణుల ప్రకారం, యోగా భంగిమలు కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. యోగా ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. యోగా ద్వారా శ్వాస వ్యాయామాలు, భంగిమలు నేర్చుకోవడం వల్ల ప్రసవ సమయంలో సులభంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మొదటి మూడు నెలల్లో జాగ్రత్త
గర్భం నిర్ధారణ అయిన తర్వాత మొదటి 12 వారాల్లో యోగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే, ఈ సమయంలో కడుపులో బిడ్డ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. అయితే, డాక్టర్ అనుమతిస్తే తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయవచ్చు.
జాగ్రత్తలు:
గర్భిణులు యోగాకు ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
గర్భం వల్ల శరీరంలో మార్పులు వస్తాయి. కాబట్టి, గర్భిణీలకు యోగా నేర్పించే అనుభవం ఉన్న వారి దగ్గర యోగా నేర్చుకోండి.
మీ గర్భధారణ దశకు తగినట్లుగా భంగిమలను మార్చుకోండి. మీకు సౌకర్యవంతంగా అనిపించే వాటిని మాత్రమే చేయండి. శరీరానికి ఒత్తిడి లేకుండా ఆసనాలు చేయండి. అసౌకర్యంగా అనిపించే ఆసనాలు చేయవద్దు. మీకు ఏదైనా అసౌకర్యం లేదా నొప్పిగా అనిపిస్తే వెంటనే యోగా చేయడం ఆపి మీ వైద్యుడిని సంప్రదించండి.
యోగా చేసేటప్పుడు ఒత్తిడి, తల తిరగడం లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి.
ఊపిరి పీల్చే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనులోమ విలోమ వంటి సాధారణ శ్వాస సాధనాలు నరాలను ప్రశాంతంగా ఉంచుతాయి. ఇవి బిడ్డకు మంచి ఆక్సిజన్ అందించేలా చేస్తాయి. ప్రసవ సమయంలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
గాలి వచ్చేటటువంటి గది లేదా స్థలంలో యోగా చేయండి. నీరు తరచూ తాగండి. గర్భధారణ సమయంలో శరీరంలో వేడి ఎక్కువైతే ప్రమాదమవుతుంది. కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు రక్తస్రావం లేదా ముందుగా ప్రసవం వచ్చే అవకాశం ఉన్నట్లయితే యోగా చేయడం మంచిది కాదు. ఏదైనా అసాధారణ లక్షణం ఉంటే ముందుగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..
For More Health News