Steamed vs Raw Sprouts: మొలకెత్తిన గింజల్ని పచ్చిగా తింటే మేలా? ఉడక బెట్టి తింటే మేలా?
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:05 PM
Steamed vs Raw Sprouts: పచ్చి మొలకెత్తిన గింజల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ కోలీ, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా వాటిలో ఉంటాయి. పచ్చి వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
మొలకెత్తిన గింజల్ని తినటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కేవలం మొలకెత్తిన గింజల్ని మాత్రమే తింటూ ఉంటారు. అయితే, వర్షాకాలంలో మాత్రం పచ్చిగా ఏవి తిన్నా ఆరోగ్యానికి నష్టమే. మరీ ముఖ్యంగా మొలకెత్తిన గింజల్ని పచ్చిగా తింటే రోగాల్ని కొనితెచ్చుకున్నట్లే. ఎందుకంటే.. బ్యాక్టీరియాతో పాటు ఇతర క్రిములు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నేరుగా వాటిని తీసుకోవటం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎలా తింటే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఉడకబెట్టి తినటం వల్ల..
వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. ఏ చిన్న సమస్యను కూడా జీర్ణ వ్యవస్థ తట్టుకోలేదు. రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే మొలకెత్తిన గింజల్ని తగిన మోతాదులో ఉడకబెట్టుకోవాలి. అలా చేస్తే నమలడానికి, అరిగించుకోవడానికి సరిగ్గా సరిపోతాయి. తరచుగా జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఛాయిస్.
అంతేకాదు.. ఉడకబెట్టిన వాటిని తినటం వల్ల అందులోని బ్యాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు చనిపోతాయి. బయో అవాలబిటీ పెరుగుతుంది. మిటమిన్స్, మినరల్స్‌ను శరీరం సులభంగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఉడకబెట్టి తినటం వల్ల లాభాలతో పాటు కొంత నష్టం కూడా ఉంది. మొలకెత్తిన గింజల్లోని పోషక విలువలు కొంత మేర తగ్గిపోతాయి.
పచ్చిగా తినటం వల్ల..
ఉడకబెట్టి తినటం కంటే .. పచ్చిగా తింటేనే కొంతమందికి నచ్చుతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఫ్రెష్ వాటిని తినటం వల్ల జీర్ణక్రియకు దోహదపడే లైవ్ ఎంజైమ్స్ పెద్ద మొత్తంలో శరీరానికి అందుతాయి. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. పచ్చి వాటిలో విటమిన్ సీ, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియం అధికమొత్తంలో ఉంటాయి. పచ్చి మొలకెత్తిన గింజల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. లావు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్.
ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. రెండో వైపు మన ఆరోగ్యం దెబ్బ తీసే విషయాలు చాలా ఉన్నాయి. పచ్చి మొలకెత్తిన గింజల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ కోలీ, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా వాటిలో ఉంటాయి. పచ్చి వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలు, గర్భిణులు, ముసలి వాళ్లు, వ్యాధి నిరోధక శక్తి సరిగా లేని వాళ్లకు ఇది మంచి ఛాయిస్ కాదు. బాగా కడిగినా కూడా అందులోని చాలా రకాల క్రిములు చనిపోవు.
ఇవి కూడా చదవండి
సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
అదనపు కట్నం కోసం భార్య హత్య.. భర్తపై ఎన్‌కౌంటర్..