Hair Dye - Side Effects: రెగ్యులర్‌గా హెయిర్ డై వేసుకునే వారు తెలియక చేసే తప్పు ఏంటంటే..
ABN , Publish Date - Mar 10 , 2025 | 10:51 PM
జుట్టుకు తరచూ రంగు వేసుకునే వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు హెయిర్ డైలతో ప్రమాదాలు ఏవో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: హెయిర్ డై అనేది కొందరికి అవసరం అయితే మరికొందరికి తమ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకునే విధానం. కానీ ఇలా తరచూ హెయిర్ డై వేసుకునే వారి జుట్టు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్‌తో నిండిన హెయిర్ డైలు వాడటం వలన జుట్టు ఆరోగ్యంతో పాటు నెత్తిపై చర్మం కూడా దెబ్బతింటుందట. మరి నిత్యం హెయిర్ డైతో వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం (Health).
నిత్యం హెయిర్ డైలు వాడే వారిలో మొదటగా కనిపించే సమస్య జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం. అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు జుట్టుపై ఉన్న సహజసిద్ధమైన నూనె పొరను ధ్వంసం చేస్తాయి. దీంతో, జుట్టు పెళుసుగా మారి చివరకు త్వరగా ఊడిపోతాయి. తరచూ బ్లీచింగ్ లేదా కలరింగ్ వల్ల జుట్టు ప్రొటీన్ల అమరికలో మార్పులు జరిగి జుట్టూ ఊడిపోవడం ఎక్కువవుతుంది.
కెమికల్ హెయిర్ డైస్ కారణంగా నెత్తిపై చర్మం చికాకు పెట్టడం దురద, ఎర్రబడటం, అలర్జీ రియాక్షన్లు ఎక్కువవుతాయి. హెయిర్ డైలో ఉండే పారా ఫినైల్ డైఅమైన్ కాంటాక్ట్ డర్మటైటిస్‌కు కూడా కారణమవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో ఒక్కోసారి నెత్తిపై పొక్కులు కూడా వస్తాయి.
Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం
హెయిర్ డైలు ఎక్కువగా వాడితే జుట్టు కూడా పలచబడుతుంది. హెయిర్ డైల్లోని కఠినమైన కెమికల్స్ కారణంగా నెత్తి చర్మంపై ఉన్న సహజసిద్ధమైన నూనెలు తొలగిపోతాయి. దీంతో, జుట్టు క్రమంగా బలహీనపడిపోతుంది. త్వరగా ఊడిపోతుంది. చివరకు ఇది జుట్టు పలచబడటానికి కారణం అవుతుంది.
హెయిర్ డై చేసుకునే వారిలో జుట్టు గరుకుగా ఎండిపోయినట్టు కూడా ఉంటుంది. మునుపు ఉన్న సున్నితత్వం కనుమరుగవుతుంది. చివరకు అందవిహీనంగా మారుతుంది. జుట్టు పొడిబారి, జీవం లేనిదిగా కనబడుతుంది. ఇక ఇలాంటి హెయిర్ డైలు కంట్లో పడితే ఒక్కోసారి తీవ్ర సమస్యలు వస్తాయి.
Foods - Hormonal Imbalance: ఈ ఫుడ్స్‌ను కలిపి తింటే.. హార్మోన్లు కట్టుతప్పటినట్టే..!
హెయిర్ డైలు జుట్టుపైనే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రంగుల్లోని కొన్ని రసాయనాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. హార్మోన్ల సమతౌల్యతను కూడా దెబ్బతీస్తాయి.
ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు అమోనియా లేని సహజసిద్ధమైన హెయిర్ డైలు వాడాలి. వీలైనంత తక్కువసార్లు జుట్టుకు రంగులు వేసుకోవాలి. జుట్టుకు రంగు వేసుకున్నాక ఎండలో తిరగడం తగ్గించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకూ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.