Eating Breakfast At Right Time: బ్రేక్ ఫాస్ట్ సరైన సమయంలో తీసుకుంటే.. ఇన్ని లాభాలా..
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:18 PM
బ్రేక్ ఫాస్ట్ సరైన సమయంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. అనారోగ్యంతోపాటు మానసిక సమస్యలు సైతం దూరమవుతాయి.
బ్రేక్ ఫాస్ట్ సరైన సమయంలో తీసుకుంటే.. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంకా చెప్పాలంటే.. షుగర్ సమస్యను సైతం నియంత్రించ వచ్చు. బ్రేక్ ఫాస్ట్.. ఆరోగ్యంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
మనం తినే ఆహారంతోపాటు.. తినే సమయం సైతం ముఖ్యం. చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఉదయం చాలా ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. అయితే ఇటీవల చేసిన అధ్యయనంలో.. ఈ అలవాటు వల్ల ఆయుష్షు తగ్గుతుందని తెలింది.
బ్రేక్ ఫాస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు: టిఫిన్ రోజుకు అవసరమైన శక్తిని అందించడమే కాకుండా.. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. సమయానికి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. అందువల్ల ఆయుర్దాయం పెరుగుతుంది.
ఇక వయస్సు పెరిగే కొద్ది భోజన సమయాలు మారతాయి. టిఫిన్, రాత్రి భోజనం సమయం చాలా స్వల్ప వ్యవధిలో తీసుకుంటారు. వృద్ధులు తినే సమయం ఆధారంగా వారి ఆరోగ్య స్థితి ఉంటుంది. అందుకే భోజన సమయాల్లో మార్పుల చేసుకోవాలని వైద్యులు ముందుగా రోగులను హెచ్చరిస్తారు.
అయితే అల్పాహారం ఆలస్యంగా తీసుకునే వారిలో అనేక అనారోగ్య సమస్యలను గుర్తించారు. నిరాశ, అలసట తదితర సమస్యలతోపాటు మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అల్పాహారం ఆలస్యంగా తీసుకునే వృద్ధుల్లో మరణ ప్రమాదం పెరుగుతుంది.
ఉదయం నిద్ర లేచిన రెండు గంటలలోపు టిఫిన్ తీసుకోవడం ఉత్తమం. వాటిలో పండ్లు, ధాన్యాలు, ప్రోటీన్లతో నిండి ఉండాలి. అలా అయితే రోజుంతా చురుకుగా ఉంటారు. టిఫిన్ ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఉదయం 8.30 గంటలకు ముందు టిఫిన్ తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకు కారణం.. మనం ఉదయాన్నే టిఫిన్ తీసుకున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పని చేస్తుంది. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత.. ఉదయం ఆలస్యంగా టిఫిన్ తింటే.. దీర్ఘకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత పెరిగే అవకాశం ఉంది.
ఇక భోజన సమయం మనస్సుకు సంబంధించింది. ఆరోగ్యకరమైన మెదడు పనితీరులో భోజన సమయం కీలక పాత్ర పోషిస్తుంది. టిఫిన్ తినకుండా ఉండడం లేదా ఉదయం ఆలస్యంగా తీసుకోవడం వల్ల మెదడుకు గ్లూకోజ్ సరఫరా తగ్గుతుంది. ఇది ఏకాగ్రత తగ్గడం, మానసిక స్థితిలో మార్పులతోపాటు జ్ఞాపక శక్తి సమస్యలకు దారి తీస్తుంది. సరైన సమయంలో టిఫిన్ తీసుకోవడం వల్ల అన్ని విధాల మంచిది. అంతేకాకుండా సరైన సమయంలో భోజనం తీసుకోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్‌మీటర్లు ఉత్పత్తికి తొడ్పడుతుంది. ఇది మానసిక ఆరోగ్యంతోపాటు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.