Share News

Chinese Cinnamon Health Risk: రుచి కోసం రిస్క్ వద్దు! చైనా దాల్చిన చెక్కలో దాగున్న ప్రమాదం.!

ABN , Publish Date - Nov 30 , 2025 | 03:48 PM

దాల్చిన చెక్క వంటల్లో ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు దాగి ఉన్నాయి. అయితే, ఈ దాల్చిన చెక్క మాత్రం చాలా హానికరమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Chinese Cinnamon Health Risk: రుచి కోసం రిస్క్ వద్దు! చైనా దాల్చిన చెక్కలో దాగున్న ప్రమాదం.!
Chinese Cinnamon Health Risk

ఇంటర్నెట్ డెస్క్: సండే వచ్చిందంటే చాలు కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆదివారం అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ టేస్ట్‌ను పెంచడానికి చికెన్ లేదా మటన్‌లో ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అందులో దాల్చిన చెక్క కూడా ఉంటుంది. ఈ దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

దాల్చిన చెక్కలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో మన దేశం.. చైనా నుండి దాల్చిన చెక్కను దిగుమతి చేసుకుంటుంది. మార్కెట్లలో ఇప్పుడు చైనా దాల్చిన చెక్క ఎక్కువగా అందుబాటులోకి వస్తోంది. అయితే, పొరపాటునా కూడా రుచి కోసం ఈ చైనా దాల్చిన చెక్కను ఉపయోగిస్తే ఇక అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఆ చైనా దాల్చిన చెక్క ఎలా ఉంటుంది? మార్కెట్లో దాన్ని ఎలా గుర్తించాలి? వాటిని వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


లివర్, కిడ్నీ దెబ్బతింటాయి.!

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చైనా దాల్చిన చెక్కలో కౌమారిన్ 1 శాతం ఉంటుంది. కౌమారిన్ అనేది మన శరీరంలోని లివర్, కిడ్నీ అవయవాలను దెబ్బతీస్తుంది. చైనా దాల్చిన చెక్కను ఎక్కువ కాలం పాటు వాడితే ఈ రెండు అవయవాలూ దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లివర్‌లో మంట, నొప్పిగా అనిపిస్తుంది. అంతేకాకుండా కాలక్రమేణా పనిచెయ్యడం పూర్తిగా మానేస్తుంది. కౌమారిన్ లివర్, కిడ్నీని దెబ్బతీయడమే కాకుండా రక్తాన్ని కూడా పలుచగా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలా చేసే గుణాలు చైనా దాల్చిన చెక్కలోని కౌమారిన్‌లో ఉన్నాయని వివరిస్తున్నారు. అందువల్ల చైనా దాల్చిన చెక్కను ఉపయోగించుకోవడం ఏ మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

చైనా దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తే గాయం అయినప్పుడు రక్తం అదే పనిగా కారిపోతూ ఉంటుందని చెబుతున్నారు. అది త్వరగా గడ్డకట్టదని, శరీరంలో ట్యూమర్లు కూడా వస్తాయని అంటున్నారు. కొన్ని కణాలు ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు జంతువులపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇలా మొత్తంగా చైనా దాల్చిన చెక్క చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రుచి కోసం రిస్క్‌లో పడొద్దని సూచిస్తున్నారు. చౌకగా లభిస్తుంది కదా అని ఈ దాల్చిన చెక్కని తీసుకుంటే.. మీ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు దెబ్బతిని ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఎలా గుర్తించాలి?

చైనా దాల్చిన చెక్కను దాని ఘాటైన, కారంగా ఉండే వాసన, గట్టి, మందపాటి బెరడు, తక్కువ ధర ద్వారా గుర్తించవచ్చు. నిజమైన సిలోన్ దాల్చిన చెక్కతో పోలిస్తే ఇది లేత గోధుమ రంగులో ఉండదు. అంత సువాసన కలిగి ఉండదు. నిజమైన సిలోన్ దాల్చిన చెక్క సన్నని పొరలతో, తీపి వాసనతో ఉంటుంది. అయితే సాధారణంగా మార్కెట్లో లభించే కాసియా దాల్చిన చెక్క గట్టిగా, ముదురు రంగులో ఉంటుంది.


Also Read:

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

పాలకోవా ఆరోగ్యానికి మంచిదేనా?

Read Latest Health News

Updated Date - Nov 30 , 2025 | 04:02 PM