విదేశీ పళ్లు మంచివేనా..
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:05 AM
ఇటీవలి కాలంలో విదేశీ ఆపిల్స్, విదేశీ జామపళ్ళు మన మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చూడటానికి ఆకర్షణీయంగా, నిల్వకాలం ఎక్కువగా ఉండటం, సీజన్‌కి సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా లభించడం వల్ల వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
మన మార్కెట్లలో విదేశీ ఆపిల్స్, విదేశీ జామపళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పండ్లలో పోషక విలువలు సాధారణంగానే ఉంటాయా? వీటిని తినడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి?
- శృతి, హైదరాబాద్
ఇటీవలి కాలంలో విదేశీ ఆపిల్స్, విదేశీ జామపళ్ళు మన మార్కెట్లలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చూడటానికి ఆకర్షణీయంగా, నిల్వకాలం ఎక్కువగా ఉండటం, సీజన్‌కి సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా లభించడం వల్ల వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అన్ని పండ్లలానే ఈ పండ్లలో కూడా విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్స్ లాంటి పోషకాలు ఉంటాయి.
ఉదాహరణకు ఆపిల్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెంచుతుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. అలాగే జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, పొటాషియం అధికంగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యం, చర్మం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ కారణంగా విదేశీ పండ్లు కూడా ఆరోగ్యానికి కొంతవరకు ప్రయోజనకరమే. రవాణా, కోల్డ్ స్టోరేజ్ కారణంగా సహజమైన రుచి, కొంతమేర పోషకాలు కూడా తగ్గిపోవడం సాధారణం. అందువల్ల విదేశీ పండ్లను తరచుగా తినడం కన్నా మన సీజనల్ స్థానిక పండ్లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. బొప్పాయి, అరటిపండు, నేరేడు, అంజీర, అల్బుకార, ద్రాక్ష, బత్తాయి, జామ, దానిమ్మ లాంటి పండ్లు తాజాగా లభించడంతో పాటు తక్కువ రసాయనాల వాడకం ఉంటాయి. ఇవి మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకుంటుంది. విదేశీ పండ్లు అప్పుడప్పుడు తినవచ్చు కానీ స్థానిక సీజనల్ పండ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మరింత ప్రయోజనకరం.

ఈ మధ్య కాలంలో వాపు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. వాపును తగ్గించే ఆహార పదార్థాల గురించి వివరించండి.
- కోమలి, నర్సీపట్నం
యాంటీఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి శరీరంలో వచ్చే వాపు తగ్గించడానికి సహా యపడే ఆహారాలు. శరీరానికి వాపు అనేది సహజ రక్షణ ప్రక్రియ. అయినా, అది ఎక్కువ కాలం కొనసాగితే కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, షుగర్, చర్మ సమ స్యలు లాంటి దీర్ఘకాలిక జబ్బులకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆహారపు అలవాట్లలో మార్పు ముఖ్యం. సహజంగానే ఆకర్షణీయమైన వర్ణాల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు అధికంగా ఉంటాయి.
జామ, ద్రాక్ష, దానిమ్మ, నారింజ లాంటి పండ్లు, పాలకూర, గోంగూర, టమాటా లాంటి ఆకుకూరలు, కూరగాయలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. బాదం, ఆక్రోటు, అవిసె గింజలు, చియా సీడ్స్ లాంటి పప్పులు, విత్తనాలలో ఉండే విట మిన్ ఏ, విటమిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించేందుకు తోడ్పడతాయి. అల్లం, వెల్లుల్లిలాంటి మసాలాలలో సహజమైన శక్తిమంతమైన యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అదనంగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ కూడా ఉపయోగకరమని చెప్పవచ్చు. ఇలాంటివాటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని వాపు, కీళ్ల నొప్పులు తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగవ్వడంతో పాటు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఉప్పు లేని ఆహారాన్ని ఊహించలేం. ఆహార పదార్థాల్లో ఉప్పునకు బదులుగా వేరే ఏదైనా ఉపయోగించవచ్చా?
- లక్ష్మణ్, కాకినాడ
మన రోజువారీ ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ అవసరానికి మించి ఎక్కువగా ఉప్పు తీసు కోవడం వల్ల రక్తపోటు, గుండె, కిడ్నీ తదితర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉప్పును పూర్తిగా మానేయడం చాలా మందికి కష్టం, ఎందుకంటే రుచి తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఉప్పు రుచి తగ్గినప్పుడు దానికి బదులుగా వంటకాల్లో నిమ్మరసం, వెనిగర్, టమాటా రసంలాంటి పదార్థాలు వేస్తే ఆహారానికి పులుపు రుచి వస్తుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు, కరివేపాకు లాంటివి ఆహారానికి సహజమైన సువాసన, రుచిని ఇస్తాయి.
అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, మిర్చి పొడి, దాల్చిన చెక్క లాంటి మసాలాలు కూడా వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.
వీటిని సరైన మోతాదులో వాడితే ఉప్పు తగ్గించినా ఆహారం రుచి తగ్గదు. అంటే, ఉప్పును పూర్తిగా మానేయక పోయినా, దాని వినియోగాన్ని తగ్గించడం కోసం సహజమైన రుచి కలిగించే పదార్థాలు వాడవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఆహారాన్ని వండేప్పుడే ఉప్పు వెయ్యకుండా తినేముందు కొద్ది మోతాదులో ఉప్పు చల్లుకొని తినడం వల్ల రోజూ తీసుకొనే ఉప్పు పరిమాణాన్ని నియంత్రించొచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్